సముద్రానికి ట్యాప్‌

సముద్రానికి ట్యాప్‌ - Sakshi


నిజమేనండీ! అంత సముద్రం ఉన్నా... చుక్క తాగలేం. ఉప్పు కశం కదా! కానీ ఇక్కడ కనబడుతోంది చూడండీ... ఇది సముద్రాన్ని చిలికి అమృతం లాంటి తాగునీటిని ఇస్తుంది.



చూడగానే ‘వావ్‌.... ఏంటిది అద్భుతంగా ఉంది’ అనిపిస్తోంది కదూ! దీని ఆకారమే కాదు... పనితీరు కూడా అద్భుతంగానే ఉంటుంది. ఈ గొట్టంలాంటి నిర్మాణం పేరు ‘ది పైప్‌’. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉండే శాంటా మోనికా పైర్‌ వద్ద దీన్ని ఏర్పాటు చేయాలన్నది సంకల్పం. ఈ సంకల్పం వెనుక పెద్ద కారణమే ఉంది.



భూమ్మీద చాలా చోట్ల నీటికొరత తీవ్రంగా ఉంది. సముద్రాల్లో తరగనంత నీరు ఉన్నా అది తాగడానికి పనికి రాదు. అదే ఆ ఉప్పునీటిని మంచినీటిగా మలచుకుంటే? ఈ ఆలోచనే ‘ద పైప్‌’ నిర్మాణానికి పురికొల్పింది. కెనడాకు చెందిన ఖలీలీ ఇంజినీరింగ్‌ సంస్థ దీన్ని డిజైన్‌ చేసింది. అయితే దీనికి భారీ ఎత్తున విద్యుత్తు అవసరం. సౌర పవన విద్యుత్తులకైనా విలువైన భూమిని ఎంతో కొంత వదులుకోవాలి. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఉప్పునీటిని మంచినీటిగా మార్చేందుకు పనికొచ్చే సూపర్‌ ఐడియా కనిపెట్టారు. సముద్రంపై ఫొటో వోల్టాయిక్‌ సెల్స్‌నే కవచంగా మార్చి దీన్ని నిర్మిస్తారు. ఈ సెల్స్‌ ద్వారా పుట్టే విద్యుత్తును ఉపయోగించుకుని సముద్రపు నీటిని మంచినీటిగా మారుస్తారు. మిగిలిపోయిన వ్యర్థాన్ని (బ్రైన్‌) కూడా శుద్ధి చేసి సముద్రంలోకి వదిలివేసే ఏర్పాట్లు ఉన్నాయి. అంటే దీనివల్ల పర్యావరణానికి కూడా ఇబ్బంది ఉండదన్నమాట! దానికితోడు తీరానికి దగ్గరగానే ఏర్పాటు చేయడం వల్ల ఇదో టూరిస్ట్‌ అట్రాక్షన్‌లానూ ఉంటుంది. భలే ఐడియా కదూ!



‘ల్యాండ్‌ ఆర్ట్‌ జనరేటర్‌ ఇనీషియేటివ్‌ – 2016’ పోటీలో బహుమతి కూడా కొట్టేసిన ఈ డిజైన్‌ అమల్లోకి వస్తే ఎంత విద్యుత్తు, నీరు ఉత్పత్తి అవుతాయో తెలుసా? ఏడాదికి పదివేల మెగావాట్ల విద్యుత్తు... 600 కోట్ల లీటర్ల మంచినీరు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top