ముట్టుకోకుండానే స్మార్ట్‌ ఫోన్ ఆపరేషన్

ముట్టుకోకుండానే స్మార్ట్‌ ఫోన్ ఆపరేషన్


సైన్స్ ఫిక్షన్ సినిమాల్లా సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలో టచ్ స్క్రీన్ ఫోన్లు ఓ పెద్ద ముందడుగుగా భావిస్తున్న తరుణంలో అసలు టచ్ చేయకుండానే అంటే ఫోన్‌ను ముట్టుకోకుండా ఏడడుగుల దూరం నుంచి చేతిసైగల ద్వారానే స్మార్ట్ ఫోన్‌ను ఆపరేట్ చేస్తే... ఏదో పనిలో నిమగ్నమైన మనం అటు వైపు చూపుడు వేలు తిప్పి ఫోన్ ఆన్ చేసి మాట్లాడనూ వచ్చు. ఆఫ్ చేయనూ వచ్చు. ఎంచక్కా దూరం నుంచే సెల్ఫీలు తీసుకోవచ్చు. ఫొటో  ఆల్బమ్‌లు చూడవచ్చు. ఇష్టమైన సంగీతాన్ని వెతుక్కోవచ్చు, విననూ వచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్‌లో ఉన్న అన్ని యాప్స్‌ను ఆపరేట్ చేయవచ్చు.



అల్ట్రా సౌండ్ తరంగాల ద్వారా పనిచేసే ఈ విధానాన్ని నార్వేలోని ఎలిప్టిక్ ల్యాబ్ కనిపెట్టింది. దీని కోసం స్మార్ట్‌ఫోన్ స్పీకర్లలో అమర్చే ప్రత్యేక పరికరం నుంచి వెలువడే అల్ట్రా సౌండ్ తరంగాలు మీ చేతి సైగలను గుర్తించి మీ ఉద్దేశాన్ని ఫోన్‌లోని సంబంధిత విభాగాలకు పంపిస్తాయి. అంతే...180 డిగ్రీల కోణంలో ఏ దిక్కు నుంచైనా మనం చేతి సైగల ద్వారా ఫోన్‌కు సందేశాలు పంపించవచ్చు. ఈ ఫోన్ల గురించి వింటుంటే  టామ్ క్రూస్ నటించిన, స్టీవెన్ స్పీల్‌బెర్గ్ దర్శకత్వంలో 2002లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'మైనారిటీ రిపోర్ట్' గుర్తుకొస్తోంది కదూ!



.సాంకేతకంగా 'అల్ట్రా ఫాస్ట్-అల్ట్రా ఫార్ ఇంటరాక్టివ్ సిస్టమ్'గా పిలిచే ఫీచర్‌ గల ఈ స్మార్ట్ ఫోన్లను ఈ ఏడాదిలోనే మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామని ఎలిప్టిక్ కంపెనీలో ఈ ప్రాడెక్ట్ అభివృద్ధి ప్రాజెక్ట్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న గెనాయెల్ స్ట్రట్ మీడియాకు తెలియజేశారు. ఆయన ఫోన్ పనిచేసే విధానాన్ని కూడా ప్రాక్టికల్‌గా ప్రదర్శించి చూపించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top