సెల్ఫీల కోసం 'చచ్చి' పోతున్నారు!

సెల్ఫీల కోసం 'చచ్చి' పోతున్నారు!


ఫొటోలలో ఇప్పుడు సెల్ఫీల హవా కొనసాగుతోందన్నది వాస్తవం. కొందరు చాలా సురక్షితమైన ప్రదేశాల్లో తీసుకుంటుండగా, మరికొందరు ప్రమాదకర పరిస్థితులలో కూడా సెల్ఫీలు తీసుకుని తమ సరదాను తీర్చుకుంటున్నారు. ఈ సెల్ఫీలకు సామాన్యుడా.. అధ్యక్షుడా.. అనే తేడాలు లేవు. కానీ సెల్ఫీల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫ్రంట్ కెమెరా మరింత అభివృద్ధి చెందిన తర్వాత ఈ సెల్ఫీ క్రేజు రోజురోజుకూ పెరిగిపోతోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 నుంచి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని మోదీ వరకూ అందరూ సెల్ఫీలు తీసుకుని సామాజిక వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తుండటంతో వారిని సామాన్య ప్రజానికం అనుసరిస్తున్నారు.



టెక్సాస్ లో గన్ పట్టుకుని సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ తండ్రి సహా ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. ఈఫిల్ టవర్ లాంటి ఎత్తైన నిర్మాణాలు, ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకుంటే నేరంగా పరిగణించాలని యూరోపియన్ యూనియన్ చట్టాన్ని తీసుకొచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. ఈ జూన్ లోనే ఓ గ్రనేడ్ పిన్ లాగుతున్నట్లుగా ఫోజు ఇస్తూ యూరల్ పర్వతాలపై సెల్ఫీ తీసుకునే యత్నంలో ఇద్దరు మరణించారు. సెల్ఫీలు తీసుకోవడం అనే అంశం వచ్చేసరికి.. మనం సాధారణ ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తిస్తామని ఓహియో వర్సిటీ ప్రొఫెసర్ జెస్సీ ఫాక్స్ పేర్కొన్నారు. తాజాగా అమెరికాలో ఓ యువకుడు గన్తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా బుల్లెట్ ...స్మిత్ గొంతులోకి దూసుకెళ్లి అక్కడిక్కడే కుప్పకూలిపోయి మరణించాడు.  



మహిళలూ అంతే క్రేజీగా..

రష్యా రాజధాని మాస్కోలో బ్రిడ్జి పట్టుకుని వేలాడుతున్నట్లు సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ యూనివర్సిటీ విద్యార్థిని చనిపోయిన విషయం విదితమే. రైలుపై నిల్చుని కరెంటు తీగలును పట్టుకుంటున్నట్లుగా ఫొజిస్తూ సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ విద్యార్థిని ఆహుతయిన విషయాన్ని అంత త్వరగా మరిచిపోలేం.



సెల్ఫీ కేంద్రాలు..

సెల్ఫీ పిచ్చి అధికంగా  వారి కోసం ఆస్ట్రేలియా వాళ్లు ఏకంగా ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సెల్ఫీ కోసం వాళ్లు ఏకంగా ఓ యాప్ ప్రారంభించారు. దీంతో వినూత్నంగా సెల్ఫీలు తీసుకోవాలనేవాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దేశాల్లో సెల్ఫీలపై నిషేధం విధిస్తూంటే.. మరికొన్ని దేశాలు ఇలా కొత్త ప్రయోగాలు చేస్తుండటం వింతగా అనిపిస్తోంది. కొన్ని దేశాల శాస్త్రవేత్తలు ఈ సెల్ఫీల గురించి ప్రస్తావిస్తూ.. సెల్ఫీలు తీసుకోవడం అనేది ఓ మానసిక రుగ్మత అని కుండబద్దలుకొట్టి చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top