నక్షత్రాన్ని ఆక్రమిస్తున్న ఏలియన్లు..!

నక్షత్రాన్ని ఆక్రమిస్తున్న ఏలియన్లు..!


న్యూఢిల్లీ: ఏలియన్లు ఆక్రమిస్తున్న నక్షత్రంగా అంతరిక్ష శాస్త్రవేత్తలు భావిస్తున్న 'టాబీ స్టార్‌'పై మారో మారు నీలి నీడలు పడ్డాయి. దీంతో ఆ నక్షత్ర నుంచి వెలువడే కాంతి పెద్ద మొత్తంలో తగ్గిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అలర్ట్‌ అయిన శాస్త్రవేత్తలు టెలిస్కోపును ఆ నక్షత్రం వైపు మళ్లించారు. ఆకాశంలో జరగుతున్న సన్నివేశాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.


2015లో తొలిసారిగా టాబీ స్టార్‌ అనే నక్షత్రాన్ని అంతరిక్షంలో గుర్తించిన పరిశోధకులు.. దాన్ని సొంతం చేసుకునేందుకు ఏలియన్లు ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓ నక్షత్రాన్ని ఏలియన్లు ఎలా సొంతం చేసుకుంటాయి?. నక్షత్రాన్ని సొంతం చేసుకోవడం అంటే దాని నుంచి వెలువడే శక్తి మొత్తాన్ని గ్రహించి తమ అవసరాలకు వాడుకోవడం.


ఇక్కడ ఏలియన్లు చేస్తున్న పని అదే. టాబీ స్టార్‌పై ఓ 'డైసన్‌ స్పియర్‌'( డైసన్‌ స్పియర్‌కు ఒక ఆకారం అంటూ లేదు. కానీ దాని నిర్మాణం భారీ స్ధాయిలో ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో కూడా శాస్త్రవేత్తలు ఊహించలేకపోతున్నారు. అందుకే దీన్ని హైపోథిటికల్‌గా భావిస్తున్నారు)ను నిర్మించి నక్షత్రం నుంచి వెలువడే కాంతి శక్తిని మొత్తం గ్రహించేందుకు ఏలియన్లు యత్నిస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. అయితే ఏలియన్లకు సంబంధించిన ఎటువంటి రేడియో సిగ్నల్స్‌ ఆ సమయంలో రాలేదని పరిశోధకులు తెలిపారు.




శాస్త్రవేత్తలకు ఎలా తెలిసింది..

2015లో అంతరిక్షంలో అన్వేషణ కొనసాగిస్తున్న నాసా పరిశోధకులు ఓ నక్షత్రం నుంచి వెలువడుతున్న కాంతిలో తేడాలు రావడాన్ని గుర్తించారు. దీంతో అది ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆ నక్షత్రానికి 'టాబీ స్టార్‌' అని పేరు పెట్టారు. పరిశోధనలో భాగంగా టెలిస్కోపులను ఉపయోగించి నక్షత్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఆ తర్వాత నుంచి ఈ నెల 19వ తేదీ వరకూ ఆ నక్షత్రం నుంచి వెలువడుతున్న కాంతిలో మార్పులు కనిపించలేదు.



మే 19వ తేదీన ఏమైంది..

కాంతిలో తేడాలు కనిపించిన నాటి నుంచి టాబీ స్టార్‌పై శాస్త్రవేత్తలు ఓ కన్నేసి ఉంచారు. ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో నక్షత్రం నుంచి సాధారణంగా వెలువడే కాంతి కన్నా మూడు శాతం తక్కువగా వెలువడటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్‌ అయిన బృందం కెప్లర్‌ టెలిస్కోప్‌ సాయంతో నక్షత్రంపై ఏం జరుగుతుందో గమనించడం ప్రారంభించారు. ఏదో గుంపు నక్షత్రం వైపు ప్రయాణిస్తున్నట్లు కనిపించడాన్ని గుర్తించారు. దీనిపై మాట్లాడిన పరిశోధకులు అంతరిక్ష ధూళి, అంతరిక్ష వాయువుల కారణంగా కనిపించే గుర్తులు వేరుగా ఉంటాయని చెప్పారు. టాబ్‌ స్టార్‌పై కనిపించిన ఆకారాలు గ్రహాంతరవాసులవి కావొచ్చని అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top