హిల్లరీకి గడ్డు పరిస్థితులు
వాషింగ్టన్: ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో తుది ఘట్టం వరకు ఉత్కంఠ వీడేలా లేదు. అధ్యక్ష బరిలో డెమొక్రటిక్ పార్టీ తరుపున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరుపున బిజినెస్ టైకూన్ డోనాల్డ్ ట్రంప్ ఉండగా వీరిద్దరిలో ఎవరినీ అమెరికా ప్రజలు ఎన్నుకోనున్నారనే విషయంలో రోజుకో రకమైన పోల్ సర్వేలు వస్తున్నాయి. కొన్ని సర్వేల్లో హిల్లరీకి పట్టంగడతారని, కొన్నింటిలో మాత్రం ట్రంపే పదవి దక్కించుకుంటాడని రోజుకో విధమైన పోల్ సర్వేలు వస్తున్నాయి.
తాజాగా విడుదల చేసిన పోల్ సర్వేలో రికార్డు స్థాయిలో అమెరికన్లు హిల్లరీ క్లింటన్ను ఇష్టపడటం లేదంట. ఆమె 25 ఏళ్ల ప్రజా జీవితంలో ఇంత ఎక్కువమంది ఆమెను ఛీదరించుకోవడం ఇదే తొలిసారని ఆ సర్వే తెలిపింది. ఆమెపై పలువురు అసంతృప్తిగా ఉన్నారని సర్వే పేర్కొంది. వాషింగ్టన్ పోస్ట్/ఏబీసీ న్యూస్ విడుదల చేసిన తాజా పోల్ సర్వేలో 56శాతం మంది అమెరికన్లు హిల్లరీకి నో చెప్తున్నారని, కేవలం 41శాతంమంది మాత్రమే ఆమెకు ఓకే అంటున్నారని తెలిసింది. గత జూన్ లో వెల్లడైన పోల్ సర్వేలో ఆమెకు వ్యతిరేకంగా 55శాతం అమెరికన్లు ఉన్నట్లు తేలగా తాజా పోల్ సర్వేలో మరొక శాతం పెరిగింది.