ఆ విమానాన్ని కావాలనే కూల్చేశారా?

ఆ విమానాన్ని కావాలనే కూల్చేశారా?


సుమారు 150 మంది ప్రాణాలు బలిగొన్న విమాన ప్రమాదానికి కారణం ఎవరు? స్వయంగా ఆ విమాన కో-పైలటే అని ప్రాసిక్యూటర్ బ్రైస్ రాబిన్ చెబుతున్నారు. జర్మనీకి చెందిన జర్మన్వింగ్స్ విమానం ఫ్రాన్సులోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అతడు కావాలనే విమానాన్ని కూల్చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆండ్రియాస్ లబిట్జ్ అనే ఈ కో-పైలట్ మతం ఏమిటన్న విషయం మాత్రం బయటపెట్టలేదు.



ప్రమాదం సంభవించడానికి కొంతసేపటి ముందు పైలట్ ఎందుకోగానీ కాక్పిట్ నుంచి బయటకు వెళ్లారు. కానీ ఆయన తిరిగి లోపలకు వెళ్లేందుకు కాక్పిట్ తలుపు కొట్టినా, కో-పైలట్ మాత్రం తలుపు తీయలేదు. విమానం కూలిపోవడానికి కొద్ది నిమిషాల ముందు వరకు కూడా కో-పైలట్ ఊపిరి సాధారణంగానే తీసుకున్నాడని, ఆయన ఏమాత్రం ఉద్వేగానికి లోనుకాలేదని అన్నారు. అతడు కావాలనే విమానాన్ని కూల్చేయాలనుకున్నట్లు ప్రాసిక్యూటర్ ఆరోపించారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఒక్క మాట కూడా రికార్డు కాలేదని, అంటే కో-పైలట్ కావాలనే అంతవరకు నిశ్శబ్దంగా ఉన్నాడని చెప్పారు.



సాధారణంగా ఎయిర్బస్ ఎ-320 తరహా విమానాల కాక్పిట్ చాలా సురక్షితంగా ఉంటుంది. ఒక పైలట్ లోపల ఉండి, మరొకరు బయట ఉంటే తలుపు తెరిచేందుకు ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. ఒకవేళ లోపల ఉన్నవాళ్లు తలుపు తీయడానికి నిరాకరించినా..అత్యవసర కోడ్ ఉపయోగించొచ్చు. అప్పటికీ లోపల నుంచి సమాధానం రాకపోతే తలుపు ఆటోమేటిగ్గా తెరుచుకుంటుంది. లోపలి వ్యక్తి బయటివాళ్లకు అనుమతి నిరాకరిస్తే మాత్రం ఐదు నిమిషాల పాటు తలుపు లాక్ అయ్యే ఉంటుంది. ఇవన్నీ చూస్తే.. కో-పైలట్ కావాలనే విమానాన్ని కూల్చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top