సిడ్నీ ఉదంతం.. తప్పు పోలీసులదేనా?

సిడ్నీ ఉదంతం.. తప్పు పోలీసులదేనా? - Sakshi


ఎప్పుడూ రద్దీగా ఉండే సిడ్నీలోని మార్టిన్ ప్రాంతంలో... గత డిసెంబర్ 15వ తేదీన సెంట్రల్ కేఫ్‌లోకి టెర్రరిస్టుగా భావిస్తున్న సాయుధుడైన మాన్ హారెన్ మోనిస్ ప్రవేశించి 18 మంది ప్రజలను బందీగా చేసుకొని భీతావహం సృష్టించడం.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పోలీసులు ప్రవేశించి 16 గంటపాటు ఉద్విగ్నంగా కొనసాగిన డ్రామాకు తెరదించడం ఇంకా మన కళ్ల ముందు కదలాడుతున్న దృశ్యమే. పోలీసులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి కమాండో ఆపరేషన్ ద్వారా టెర్రరిస్టును హతమార్చి ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా బందీలను సురక్షితంగా విడిపించారని అధికార వర్గాలు,  ప్రపంచ మీడియా ప్రశంసించిన విషయం తెలిసిందే. వాస్తవానికి పోలీసులు తొందరపడి గుడ్డిగా కాల్పులు జరపడం వల్లనే కత్రినా డాసన్ అనే ఓ బందీ మరణించారని గురువారం జుడీషియల్ విచారణలో తేలింది. తనకు తాను ఓ మతగురువుగా చెప్పుకొని కేఫ్‌లోకి ప్రవేశించిన మోనిస్ జరిపిన కాల్పుల్లో మరణించింది కేఫ్ మేనేజర్ టోరీ జాన్స్ మాత్రమే. పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాతే టెర్రరిస్టు మోనిస్ కేఫ్ మేనేజర్‌ను కాల్చి చంపాడు.



పోలీసుల కాల్పులకు దారి తీసిననాటి పరిస్థితులేమిటి? కాల్పులు జరపకుండా బందీలను విముక్తిచేసే అవకాశం లేకుండేనా? నిజంగా కత్రినా డాసన్ టెర్రరిస్టు కాల్పుల్లోనే మరణించారా? అన్న అంశాలపై న్యాయ విచారణ జరిగింది. పోలీసులు కాల్చిన బుల్లెట్ లేదా బుల్లెట్ల శకలాలు శరీరంలోకి దూసుకుపోవడం వల్లనే కత్రినా మరణించారని 'కరోనర్' తేల్చారు. కరోనర్ అంటే ఓ వ్యక్తి ఏ కారణంగా మరణించారనే విషయాన్ని ధ్రువీకరించే ప్రభుత్వ న్యాయాధికారి. పోలీసు కాల్పులతో ఆరు బుల్లెట్ శకలాలు శరీరంలోకి దూసుకుపోవడం వల్ల కత్రినా మరణించారని విచారణలో తేలింది. బారిస్టర్ చదివిన 38 ఏళ్ల ఆమె ముగ్గురు పిల్లల తల్లి. పుట్టెడు దుఖంలోవున్న డాసన్ కుటుంబ సభ్యులెవరూ విచారణకు హాజరుకాలేదు. కేఫ్ యజమాని టోని జాన్స్ కుటుంబ సభ్యులు మాత్రం హాజరయ్యారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top