అక్కడ ఆడవాళ్లతో హంతక ముఠాలు

అక్కడ ఆడవాళ్లతో హంతక ముఠాలు - Sakshi


మనీలా: ఫిలిప్పీన్స్ వీధులన్నీ ఇప్పుడు నిత్యం రక్తమోడుతున్నాయి. దేశంలోని ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ఏదో ఒక సంధులో ఓ శవం రక్తం మడుగులో పడి కనిపిస్తోంది. ‘మత్తు పదార్థాలు అమ్ముతున్నందుకు ఈ శిక్ష’ అన్న అక్షరాలు కలిగిన చిన్న అట్టముక్క శవం పక్కనే పడి ఉంటుంది. ఈ హత్యలు ప్రత్యక్షంగా చేస్తున్నదీ పోలీసులు కాదు. మహిళా హంతకులు. ఒక్కో హంతక ముఠాలో ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉంటారు. వారంతా ఆడవాళ్లే. వారి  భర్తలో, పిల్లలో మత్తు పదార్థాలకు బానిసలయ్యారనే ఆగ్రహంతోనో, ఆక్రోశంతోనో వారీ హత్యలు చేయడం లేదు. కేవలం పోలీసులిచ్చే డబ్బులకు ఆశపడి ఈ హత్యలకు పాల్పడుతున్నారు.



 ఒక్క హత్య చేసినందుకు వారికి 29 వేల రూపాయలు లభిస్తాయి. వాటిని వారు తమ బృందంలోని ముగ్గురు లేదా నలుగురు సమంగా పంచుకుంటారు. వారితో ఈ హత్యలు చేయిస్తున్నది ఫిలిప్పీన్స్ పోలీసు అధికారులే. ఇలాంటి ఓ హంత క ముఠాకు నాయకత్వం వహిస్తున్న మనీలాలోని మరియాను మీడియా కలసుకొని ఇంటర్వ్యూ చేసింది. తాను ఇంతవరకు ఐదు హత్యలు చేశానని, మొదటిసారి హత్య చేసినప్పుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యానని మరియా తెలిపారు. ఆ తర్వాత ప్రతి హత్యకు ముందు అదే తాను చేసే ఆఖరి హత్య కావాలని కోరుకునేదాన్నని, అయితే హంతక ముఠా నుంచి తామెవరం బయటకు వెళ్లిపోయినా తమను చంపేస్తామని తమ పోలీసు బాస్ తీవ్రంగా బెదిరించారని, వారి బెదిరింపులకు భయపడి హత్యలు మీద హత్యలు చేస్తూ పోతున్నామని ఆమె తెలిపారు.



‘నా హంతక ముఠాలో ఎవరు ఎన్ని హత్యలు చేశారో నేను గుర్తుంచుకోదల్చుకోలేదు. హత్య చేసిన వెంటనే ఆ హత్య గురించి మరచి పోవడం అలవాటు చేసుకున్నాం. నేను మాత్రం స్వయంగా ఇప్పటి వరకు ఐదు హత్యలు చేశాను. ప్రతి వ్యక్తి తలకు గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపాను. మాకు తుపాకులు ఇచ్చిందీ కూడా మా పోలీసు బాసే. నా భర్త ద్వారా నాకు ఇలాంటి హత్యలు చేయడం అలవాటు అయింది. ఆయనచేత కూడా పోలీసులు డబ్బులు ఎరవేసి హత్యలు చేయించేవారు. అయితే మగవాళ్లను డ్రగ్ డీలర్లు, మాఫియా సులభంగా అనుమానించే అవకాశం ఉండడంతో ఇప్పుడు పోలీసులు ఎక్కువగా ఆడవాళ్లనే హంతక ముఠాలో చేర్చుకుంటున్నారు’ అని మరియా వివరించారు.





‘కోర్టులు శిక్షించాల్సిన మనుషులను నేను చంపేస్తున్నందుకు నాకు పశ్చాత్తాపం కలుగిన  సందర్భాలు లేకపోలేదు. మీరు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు ? ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తున్నది ? అని నా పెద్ద పిల్లవాడు మమ్మల్ని ఇద్దరిని ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు నాకు ఆందోళన కలుగుతున్నది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. మేము ఏం చేస్తున్నామో ఎప్పటీకీ మా పిల్లలకు తెలియకూడదని కోరుకుంటున్నాం. ఎంతకాలం దాచగలమో తెలియదు. ఈ రొంపిలో పడి ఇలా కొట్టుకుపోతున్నాం. మేము చంపిన వ్యక్తుల కుటుంబాలు మాత్రం మమ్మల్ని వెంటాడకపోతే చాలుననుకొని ఇలా బతికేస్తున్నాం’ అని మరియా తన గురించి మీడియాకు వివరించారు.



మరియా లాంటి హంతక ముఠా నుంచి తప్పించుకు తిరుగుతున్న చిన్నపాటి డ్రగ్ డీలర్ రోగర్‌ను కూడా కలసుకొని మీడియా ఇంటర్వ్యూ చేసింది. ‘నన్ను మృత్యు భయం అణుక్షణం వెంటాడుతోంది. ఎప్పుడు, ఏ దిశ నుంచి వచ్చి మృత్యువు నా మీద పడుతుందో తెలియక ఉన్న చోట ఉండకుండా ఇలా వీధులు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాను. నేనేదో కాయకష్టం చేసుకొని నా మానాన నేను బతికే వాడిని. తోటి వారి వల్ల నేను డ్రగ్స్‌కు బానిసయ్యాను. దాన్ని సంపాదించే ప్రయత్నంలో భాగంగా చిన్నపాటి డీలర్‌గా మారిపోయాను.



డ్రగ్స్ కోసం లేదా డ్రగ్స్ మత్తులో దొంగతనాలు, దోపిడీలకు, కొన్ని సందర్భాల్లో హత్యలకు కూడా పాల్పడతారని ప్రజలు అనుకుంటారు. నేను మాత్రం ఇంతవరకు చిన్నపాటి దొంగతనం కూడా చేయలేదు. నన్ను చంపేందుకు పోలీసులు టార్గెట్ చేశారని తెలిసి ఇలా తప్పించుకు తిరుగుతున్నాను. నా భార్యా పిల్లలను మారుమూల గ్రామానికి తరలించాను. నేను మాత్రం ప్రాణ భయంతో ఊళ్లు పట్టుకొని తిరుగుతున్నాను. లొంగిపోదామంటే పోలీసులు కచ్చితంగా చంపేస్తారని తెలుసు. నాలాంటి చిన్న వాళ్ల వెంట పడే పోలీసులు మత్తు పదార్థాలను తయారు చేస్తున్న బడా వ్యాపారులను ఎందుకు అరెస్ట్ చేయరో, వారిపై ఎందుకు చర్య తీసుకోరో అర్థం కావడం లేదు’ అని రోగర్ అన్నారు.



ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రోడ్రిగో డ్యూడర్త్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో దాదాపు రెండు వేల మంది డ్రగ్ సరఫరా దారులను హత్య చేశారు. వీరిలో 756 మందిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయగా, మిగతా వారందరిని మరియా లాంటి హంతక ముఠాలు హత్య చేశాయి. డ్రగ్ సరఫరాదారులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని కాల్చేయమని, ఎలాంటి కేసులు లేకుండా తాను చూసుకుంటానని డ్యూడర్త్ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.



అధికారంలోకి వచ్చిన అరు నెలల్లోపలే డ్రగ్ మాఫియాతో సహా లక్ష మంది క్రిమినల్స్‌ను అంతం చేస్తానని కూడా ఆయన శపథం చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోయిన రెండు వేల మందిలో 98 శాతం మంది మురికి వాడల్లో నివసించే పేదవాళ్లే. మత్తుపదార్థాలను దేశంలో విరివిగా ఉత్పత్తి చేస్తూ దేశంతోపాటు మొత్తం ఆసియా దేశాలకు సరఫరా చేస్తున్న ఒక్క బడా వ్యక్తిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇంతవరకు పదివేల మంది డీలర్లను పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో ఎక్కువ మంది మధ్య, దిగువ స్థాయి డీలర్లు మాత్రమే ఉన్నారు.



ఐదుగురు పోలీసు జనరళ్లు, ఉన్నత పౌర అధికారులు, జడ్జీలు, రాజకీయ నాయకలు...ఇలా  ఉన్నత స్థాయిలో డ్రగ్ మాఫియాతో కుమ్మక్కయినవాళ్లు ఎందరో ఉన్నారు.  ఆ చైన్‌ను బ్రేక్ చేయకుండా చిన్నస్థాయి డ్రగ్ సరఫరా దారులను, బానిసలు చంపేస్తే ప్రయోజనం ఏం ఉంటుంది? ఫిలీప్పీన్స్‌లో డ్రగ్‌ను ఐస్, క్రిస్టల్ మిత్, షాబు అని పిలుస్తారు. పూర్తి స్వచ్ఛమైన సరకును షాబు అని కోడ్ భాషలో చెబుతారు. స్మోకింగ్, ముక్కుతో పీల్చడం, ఇంజెక్షన్, నీళ్లలో కలుపుకోవడం ద్వారా ఈ డ్రగ్‌ను తీసుకుంటారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top