ప్రాణాలు తీస్తున్న సరికొత్త ఛాలెంజ్

2011లో పారాసిటమాల్ ఓవర్ డోస్ వల్ల మరణించిన షార్లట్ యూసఫ్


(సాక్షి వెబ్ ప్రత్యేకం)


ఆన్‌లైన్ ఛాలెంజ్‌లు వెర్రితలలు వేస్తున్నాయి. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆ కోవకు చెందినదే 'పారాసిటమాల్ ఛాలెంజ్'.  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక వెబ్‌సైట్లలో విస్తృత ప్రచారం జరుగుతున్న ఈ ఛాలెంజ్ పిల్లల ప్రాణాలు తీస్తూ తల్లిదండ్రులకు పుట్టెడు దు:ఖాన్ని మిగిలిస్తోంది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన పిల్లల్లో స్కాట్‌లాండ్‌లోని ఐషైర్‌లో 15 ఏళ్ల బాలుడు తొలుత మృత్యువు బారిన పడ్డాడు. ఆ తర్వాత...ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో పదుల సంఖ్యలో పిల్లలు మరణించినట్టు అనధికార వార్తలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి ఛాలెంజ్‌లకు దిగి నిండు ప్రాణాలను బలితీసుకోవద్దని పిల్లలు, యువతీ యువకులను పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి. 'మీరు మా కూతురులాగా ప్రాణాలు తీసుకోవద్దు! ఇలాంటి ఛాలెంజ్‌లకు దూరంగా ఉండండి' అంటూపారాసిటమాల్ ఓవర్ డోస్ వల్ల 2011లో తమ 19 ఏళ్ల కూతురును పోగొట్టుకున్న మాండీ, పీటర్ యూసుఫ్ అనే తల్లిదండ్రులు సామాజిక వెబ్‌సైట్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.



షార్లట్ యూసఫ్ అనే వాళ్ల కూతురు పెళ్లికి సరిగ్గా ఒకరోజు ముందు పారాసిటమాల్ ఓవర్ డోస్ వల్ల ఇంగ్లండ్‌లోని బ్లాక్‌పూల్ విక్టోరియా హాస్పిటల్‌లో ప్రాణాలు కోల్పోయింది. ప్రపంచంలోకెల్లా పారాసిటమాల్‌ను ఎక్కువగా వినియోగించే బ్రిటన్‌లో 'పారాసిటమాల్ ఛాలెంజ్'కు వ్యతిరేకంగా  పాఠశాలల టీచర్లను, పిల్లల తల్లిదండ్రులను అక్కడి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మందుల షాపులపై అనేక ఆంక్షలను విధించింది. ప్రాణాంతకమైన పారాసిటమాల్‌పై ఇప్పటికే బ్రిటన్ మెడిసిన్ రెగ్యులేటరీ ఏజెన్సీ విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు ఎప్పుడో ఈ మందును పూర్తిగా నిషేధించగా, కొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి.



2009లో అమెరికాలోని 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' పారాసిటమాల్‌పై ఆంక్షలు విధించింది. పారాసిటమాల్‌ను నేరుగా కాకుండా కాంబినేషన్‌లో మాత్రమే అక్కడ అనుమతిస్తున్నారు. తీవ్రమైన జ్వరం వస్తే తప్ప పిల్లలకు పారాసిటమాల్ ఇవ్వరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే మార్గర్శకాలను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్‌ను పూర్తిగా నిషేధించాలంటూ ఈడెన్‌బెర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన కాలేయ మార్పిడి కేంద్రం అధిపతిగా, స్కాట్‌లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసిన సర్ డేవిడ్ కార్టర్ పెద్ద ఉద్యమాన్నే నడిపారు.



భారత్ లాంటి వర్ధమాన దేశాలు మాత్రం పారాసిటమాల్ వినియోగంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ప్రపంచవ్యాప్తంగా 200 బ్రాండ్‌లు అందుబాటులో ఉండగా, భారత్‌లో మాత్రం చిన్న కంపెనీలు మొదలుకొని 1497 కంపెనీలు పారాసిటమాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, సిరప్, ఇంజెక్షన్, క్రీమ్, జెల్, ఆయింట్‌మెంట్ రూపాల్లో పారాసిటమాల్‌ను విక్రయిస్తున్నాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి సత్వరం ఉపశమనం కలిగిస్తుండడంతో వైద్యులు పారాసిటమాల్‌ను ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఈ మందును ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి హఠాత్తుగా పడిపోతుంది, లివర్, కిడ్నీలు, మెదడు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి.



అసలేమిటీ ఛాలెంజ్?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వెర్రితలలు వేస్తున్న కొత్త ట్రెండు.. 'పారాసిటమాల్ ఛాలెంజ్'. పిల్లలు, యువత దీని జోలికి వెళ్లొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే పెయిన్ కిల్లర్లు ఇస్తుండటంతో.. వాటిని పెద్దసంఖ్యలో కొనుగోలు చేయడం, ఎక్కువ మొత్తంలో వేసుకుని ఆ ఫొటోలను ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో #ParacetamolChallenge అనే హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేయడం.. ఇదీ స్థూలంగా పారాసిటమాల్ ఛాలెంజ్. ఈ వెర్రి స్కాట్లండ్లో మొదలై.. ప్రపంచంలో చాలా మూలలకు పాకింది.


-వి.నరేందర్ రెడ్డి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top