పాకిస్తాన్‌ ఆర్మీ.. పనామా ఆయుధం

పాకిస్తాన్‌ ఆర్మీ.. పనామా ఆయుధం - Sakshi


న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆ దేశ ఆర్మీ ప్రయత్నిస్తోందని పాకిస్తానీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం పచ్చగా ఉండటం ఇష్టం లేని ఆర్మీనే పనామా పేపర్ల కుంభకోణంలో షరీఫ్‌ కుటుంబాన్ని ఇరికిస్తోందని సగటు పాకిస్తాన్‌ పౌరుడు సోషల్‌మీడియా వేదికగా ఆరోపిస్తున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.



పాకిస్తాన్‌ ప్రజలు ఆర్మీపై ఇంతలా ఆరోపణలు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఇప్పటివరకూ మూడు మార్లు పాకిస్తాన్‌ ఆర్మీ దేశంపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నించి చతికిలపడింది. వాస్తవానికి పాకిస్తాన్‌లో ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం నడుస్తున్నా.. ఆ దేశ ఆర్మీనే పాలసీల నిర్ణయాల్లో కీలకపాత్ర వహిస్తుందన్న విషయం బహిరంగ రహస్యం.



తాజాగా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆర్మీ చేస్తున్న కుట్ర అనే విషయాన్ని బలపర్చడానికి జాయింట్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(జిట్‌) కూర్పే ఆధారంగా నిలుస్తోంది. జిట్‌లో ఉన్న సభ్యుల్లో పాకిస్తాన్‌ ఇంటిలిజెన్స్‌, ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటిలిజెన్స్‌(ఐఎస్‌ఐ), మిలటరీ ఇంటిలిజెన్స్‌(ఎమ్‌ఐ)ల నుంచి ఒక్కో వ్యక్తి ఉన్నారు. దీంతో సగటు పాకిస్తానీ పౌరుడికి ఆర్మీ కుట్ర చేస్తుందన్న భయం పట్టుకుంది.



ఆర్మీపై ప్రజలు చేస్తున్న ఆరోపణల గురించి అధికారులను ప్రశ్నించగా.. ఎప్పటిలానే అలాంటిదేం లేదంటూ అధికార వర్గాలు కొట్టిపారేశాయి. ప్రతి ఒక్కరికి అభిప్రాయాన్ని ధైర్యంగ బయటకు చెప్పగలిగే స్వతంత్రం ఉందంటూ ఆర్మీ పీఆర్‌ఓ పేర్కొన్నారు. జిట్‌లో ఉన్న ఆర్మీ సభ్యులు సుప్రీం కోర్టుకు జవాబుదారులుగా ఉన్నారని చెప్పారు. సభ్యులు వారి విధులను నిజాయితీగా నిర్వర్తించారని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top