ఉత్తరాది ఖాతాలతో.. నైజీరియా మోసాలు

ఉత్తరాది ఖాతాలతో.. నైజీరియా మోసాలు - Sakshi

  • విశాఖ వాసి నుంచి రూ.కోటి కొట్టేసింది ఇలానే

  • ఏజెంట్ల ద్వారా ఖాతాదారులకు ఎర

  • ‘మనీమ్యూల్స్’కు కమీషన్లు ఇస్తున్న మోసగాళ్లు

  • సాక్షి, హైదరాబాద్ : లాటరీలు, ప్రైజులు తదితరాల పేర్లతో తాము చేస్తున్న మోసాల కోసం నైజీరియన్లు ఉత్తరాదికి చెందిన బ్యాంకు ఖాతాదారులను వినియోగించుకుంటున్నారు. నిరుద్యోగ యువతతో పాటు చిరుద్యోగులు, వ్యాపారులకు గాలం వేయడం ద్వారా తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. విశాఖపట్నంలోని పరవాడ మండలం పందివానిపాలెం గ్రామానికి చెందిన వెంకటరమణ నుంచి రూ.1.31 కోట్లు స్వాహా చేయడానికి నైజీరియన్లు ఇదే పంథాను అనుసరించారు. ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 31 మంది ఖాతాల్లో ఈ డబ్బును డిపాజిట్ చేయించుకున్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసిన దర్యాప్తు అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.

     

    పక్కా ప్లాన్‌తో..

    సౌతాఫ్రికా దేశాల నుంచి భారత్‌కు వచ్చి మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాధితుల నుంచి డబ్బు గుంజడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని నైజీరియన్లే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలు ఎక్కువ. దేశం బయట ఉన్న బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయమంటే కస్టమర్లు అనుమానించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇక్కడి ఖాతాలే ఉపయోగించేందుకు పథక రచన చేస్తున్నారు.

     

    దేశవ్యాప్తంగా ఏజెంట్లు..

    ముంబై, ఢిల్లీలతో పాటు ఉత్తరాదిలోని అనేక ప్రాంతాల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని తమ మోసాల వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. నిరుద్యోగ యువత, చిరుద్యోగులు, వ్యాపారులకు ఎరవేస్తున్న ఈ ఏజెంట్లు బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ కమీషన్ ఇస్తామంటారు. లావాదేవీలపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు కొందరు ప్రముఖుల నల్లధనాన్ని తాము వైట్ మనీగా మారుస్తామని, ఆదాయపుపన్నుతోపాటు ఇతర కారణాల నేపథ్యంలో ఈ ఖాతాలు అవసరమని నమ్మబలికి వారిని ఒప్పిస్తున్నారు. ఆ ఖాతాలకు సంబంధించిన డెబిట్/క్రెడిట్‌కార్డుల్ని ఏజెంట్ల ద్వారా సేకరిస్తున్న నైజీరియన్లు బాధితులు డిపాజిట్ చేసిన సొమ్మును డ్రా చేయడానికి వినియోగిస్తున్నారు. ప్రతి లావాదేవీపైనా ఏజెంట్‌తో పాటు ఖాతాదారుడికి కొంత కమీషన్ ఇస్తున్నారు. దీనివల్ల ఖాతాదారులకు, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు నైజీరియన్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో నైజీరియన్ మోసాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సూత్రధారులు దొరకడం కష్టమవుతోంది.

     

    మనీమ్యూల్స్ అంటే?

    సైబర్ మోసగాళ్లు ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏజెంట్ల ద్వారా నిరుద్యోగ యువత, చిరుద్యోగులు, వ్యాపారులకు బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారు. బాధితుల నుంచి సొమ్మును వారి ఖాతాల్లో జమచేయిస్తారు. తమ వ్యాపారానికి సహకరించే ప్రతి లావాదేవీలోనూ ఆ ఖాతాదారులకు కమీషన్ ఇస్తారు. ఈ ఖాతాదారులనే సాంకేతిక పరిభాషలో ‘మనీమ్యూల్స్’ అంటారు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top