ముగిసిన నాసా అరుదైన ప్రయోగం!


లాస్‌ఏంజిలెస్: అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న పరిస్థితులను భూభాగంపై సృష్టించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరిపిన అరుదైన ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు నాసా అమెరికాలోని హవాయి రాష్ట్రంలో అంగారక గ్రహం పరిస్థితుల్లో మానవుడి మనుగడ సాధ్యమా అన్న అంశంపై పరిశోధన నిర్వహించింది. ఆరుగురి బృందంతో ఏడాది క్రితం ప్రారంభించిన ఈ ప్రయోగం సోమవారం ముగిసింది.



జంతువులు, వృక్షాలు లేని నిర్మానుష్య ప్రాంతంలో 20 అడుగుల ఎత్తు, 36 అడుగుల వ్యాసార్ధంలో ఒక గుహ వంటి నిర్మాణాన్ని ప్రయోగం కోసం నాసా నిర్మించింది. అంగారకుడిపై ఉన్న పరిస్థితులను ఆ నిర్మాణంలో ఏర్పాటు చేసి అందులోకి ఆరుగురి బృందాన్ని 2015 ఆగస్టు 28న పంపింది. వారు అందులో నివసించేందుకుగానూ చిన్న గదులు, మంచం వంటి ఏర్పాట్లు కూడా చేశారు. వారికి ఆహారంగా పౌడర్ రూపంలోని జున్నును సమకూర్చారు.



ఈ బృందం అంగారకుడిపై ఉన్న పరిస్థితులను కల్పిస్తూ జరిపిన ప్రయోగంలో ప్రయోగం విజయవంతంగా ముగిసిందని అక్కడి పరిస్థితుల్లో కూడా హాయిగా జీవించగలిగామని ఫ్రెంచ్ శాస్త్రవేత్త సెప్రీన్ వెర్‌స్యూక్స్ అన్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగం నుంచి బయటికి వచ్చి స్వచ్ఛమైన గాలి, ఆహారం తీసుకుంటుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయోగం సత్ఫలితాలిచ్చిందని, భవిష్యత్తులో నేరుగా అంగారకుడిపైనే ప్రయోగం నిర్వహిస్తామని ఆయన అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top