పెట్టుబడులతో రండి..!

పెట్టుబడులతో రండి..! - Sakshi


అమెరికా కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపు

► జీఎస్టీతో మరింత సానుకూల మార్పుపై భరోసా

► సులభంగా వ్యాపారం చేసేందుకు 7వేల సంస్కరణలు

►  టాప్‌–20 సీఈవోలతో ప్రత్యేక భేటీలో ప్రధాని వెల్లడి  




వాషింగ్టన్‌: ప్రపంచంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా భారత్‌ వృద్ధి చెందిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వస్తే.. భారత్‌లో వ్యాపారానికి పరిస్థితుల్లో మరింత సానుకూల మార్పు వస్తుందన్నారు. వాషింగ్టన్‌లోని హోటల్‌ విల్లార్డ్‌ ఇంటర్‌కాంటినెంటల్‌లో అమెరికాలోని టాప్‌–20 కంపెనీల సీఈవోలతో ఆదివారం రాత్రి ప్రధాని సమావేశమయ్యారు.


ప్రతిష్టాత్మక వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలును అమెరికా బిజినెస్‌ స్కూళ్లలో పాఠ్యాంశంగా చేర్చవచ్చన్నారు. అమెరికన్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మోదీ కోరారు. భారత అభివృద్ధి కారణంగా భారత్‌–అమెరికా దేశాల భాగస్వామ్యం మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. దీని వల్ల అమెరికా కంపెనీలకు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృతమైన అవకాశాలు కలుగుతాయని భరోసా ఇచ్చారు. ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని.. వ్యాపార నియమనిబంధనలను సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం 7వేల సంస్కరణలు తీసుకువచ్చిందని వెల్లడించారు.


‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ కారణంగా ఇబ్బందులన్నీ దూరమవుతున్నట్లు ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మోదీ స్పష్టం చేశారు. ఈ భేటీలో గూగుల్‌ కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సత్య నాదెళ్ల సహా అమెజాన్, యాపిల్, మాస్టర్‌కార్డు, అడాబ్, అమెరికన్‌ టవర్‌ కార్పొరేషన్, కాటర్‌పిల్లర్, సిస్కో, డెలాయిట్, ఎమర్‌సన్, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, జేపీ మోర్గాన్‌ ఛేస్‌ అండ్‌ కంపెనీ, లాక్‌హీడ్‌ మార్టిన్, మారియట్‌ ఇంటర్నేషనల్, మాండెల్స్‌ ఇంటర్నేషనల్, కార్లిల్‌ గ్రూపు, వాల్‌మార్ట్, వార్‌బర్గ్‌ పింకస్, ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ కంపెనీల సీఈవోలు సహా.. అమెరికా–భారత్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ఐబీసీ) అధ్యక్షుడు ముకేశ్‌ అఘి ఈ సమావేశానికి హాజరయ్యారు.



మూడేళ్లలో ఎఫ్‌డీఐలు పెరిగాయ్‌!

గత మూడేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల వల్ల భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత్‌ ఆకర్షించిందని మోదీ తెలిపారు. భవిష్యత్తులో తన ప్రభుత్వం తీసుకురానున్న మార్పులను కూడా సీఈవోలకు ప్రధాని వివరించారు. గంటసేపు జరిగిన ఈ భేటీలో కంపెనీల సీఈవోలు చెప్పిన డిమాండ్లను ప్రధాని సావధానంగా విన్నారు.


భారత–అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, మోదీ సర్కారు తీసుకున్న నోట్లరద్దును, డిజిటలైజేషన్‌ను అమెరికన్‌ కంపెనీలు అభినందించాయి. భారత్‌లో పెట్టుబ డులకు ఉత్సాహంగా ఉన్నట్లు వెల్లడిం చాయి. ‘అంతర్జాతీయంగా పలు మార్పులు చోటుచేసుకుంటున్న సమయంలో ద్వైపాక్షిక బంధాలతో ఇరుదేశాల మధ్య కొత్త వ్యాపారావకాశాలు పుట్టుకొస్తున్నాయి’ అని యూఎస్‌ఐబీసీ వెల్లడించింది.



‘కొవ్వాడ’ అణు ఒప్పందం కుదరకపోవచ్చు!

న్యూఢిల్లీ: మోదీ, ట్రంప్‌ చర్చల్లో 2008లో ఇరు దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పం దం చర్చకు వచ్చే అవకాశముంది. అయితే , న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐఎల్‌),  వెస్టింగ్‌హౌస్‌(అమెరికా) కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకు ళం జిల్లా కొవ్వాడలో నిర్మించాలనుకున్న ఆరు అణు రియాక్టర్లపై ఒప్పందం కుదరకపోవచ్చని భారత అధికార వర్గాలు తెలిపాయి. వెస్టింగ్‌హౌస్‌ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వంటి కారణాల వల్ల ఎన్‌పీసీఐఎల్‌ ఒప్పందానికి విముఖంగా ఉంది.


2008 నాటి అణు ఒప్పందాన్ని 2017 జూన్‌ నాటికి పూర్తి స్థాయిలో ఖరారు చేసుకోవాలని  సంకల్పించినట్లు 2015లో మోదీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలిపారు. కాగా, వాతావరణ మార్పులు అబద్ధమని పేర్కొన్న ట్రంప్‌తో మోదీ భేటీ నేపథ్యంలో నాసా, ఇస్రో సంయుక్తంగా నిర్మించతలపెట్టిన ‘నిసార్‌’ఉపగ్రహ భవిష్యత్తు ఏమవుతుందోనని శాస్త్రవేత్తలు ఆందోళనపడుతున్నారు. భూగ్రహ చిత్రాలు తీయడానికి ఉద్దేశించిన నిసార్‌   ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్‌ ఇమేజ్‌ ఉపగ్రహం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top