తీరమెక్కడో.. గమ్యమేమిటో..తెలియదుపాపం!

తీరమెక్కడో.. గమ్యమేమిటో..తెలియదుపాపం! - Sakshi


బర్మా రోహింగ్యా ముస్లింల దైన్యం

ఒకవైపు ఆగర్భ దారిద్య్రం.. మరొకవైపు ఆధిపత్య జాతి హింసాకాండ! పుట్టిన గడ్డపైనే బతుకు దుర్భరం! హింసను తప్పించుకోవటానికి, ప్రాణాలు దక్కించుకోవటానికి, అసలు బతకటానికి మరో దేశానికి వలస పోవాల్సిన పరిస్థితి! మరి ఆ మరో దేశం.. వీరిని ఎలా రానిస్తుంది? అందుకే.. వారు మనుషులను అక్రమంగా రవాణా (స్మగ్లింగ్) చేసే మాఫియా కాళ్లు పట్టుకుని.. తమ జీవిత సంపాదన మొత్తాన్నీ ధారపోసి.. పడవల్లో దొంగతనంగా వెళుతున్నారు.



అలా వచ్చే వారు పదులు, వందల సంఖ్యలో అయితే ఏమోగాని వేలల్లో వచ్చేస్తూ ఉంటే ఏ దేశమైనా ఏం చేస్తుంది?.. వీల్లేదు పొమ్మని తరిమేస్తుంది! ఇప్పుడు ప్రపంచంలో అదే జరుగుతోంది. ఫలితం.. పశ్చిమాన మధ్యదరా సముద్రంలో.. తూర్పున అండమాన్ సముద్రంలో.. పెను సం క్షోభాలు పుట్టాయి! అక్కడ సిరియా, పశ్చిమాసియా, ఆఫ్రికా వాసులైతే.. ఇక్కడ మయన్మార్ (బర్మా) రోహింగ్యా జాతి ప్రజలు! వీరితో పాటు ఉపాధి కోసం బయల్దేరిన బంగ్లాదేశ్ పేద జనాలు! తమ దేశంలో బతుకు లేక బయల్దేరిన వారు..



పొరుగుదేశాలు రానివ్వకపోతుండటంతో.. నడిసముద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు! ఆకలిదప్పులతో అలమటిస్తూ చనిపోతున్నారు. చివరికి ప్రపంచం ఈ సంక్షోభంపై దృష్టిసారించింది. పరిష్కారం కనుగొనే దిశగా కృషి మొదలైంది! ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ‘ఫోకస్’...


 

బర్మాలో ఏం జరుగుతోంది?

రఖెనై రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలకు - స్థానిక రఖెనై బౌద్ధ మతస్థులకు మధ్య 2012లో మళ్లీ మత ఘర్షణలు తలెత్తాయి. ఆ క్రమంలో పశ్చిమ పట్టణ ప్రాంతాల్లోని మైనారిటీ ముస్లిం మతస్థులైన రోహింగ్యా ప్రజలపై జాతి, మత వివక్షాపూరిత హింసాకాండ మొదలైంది. ఊళ్లకు ఊళ్లు తగులబెట్టారు. ఈ హింసలో దాదాపు 100 మంది చనిపోయారు. రోహింగ్యాల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాయి. దాదాపు 1.50 లక్షల మంది రోహింగ్యాలు.. బర్మాలోనే అంతర్గత నిర్వాసితుల శరణార్థి శిబిరాల్లో బతుకుతున్నారు.



వీరు ఆ శిబిరాల నుంచి అడుగు బయటపెట్టే అవకాశమే లేదు. రోహింగ్యాల జాతిని తుదముట్టించేందుకు ప్రభుత్వం, బౌద్ధ బృందాలు ‘మానవత్వంపై నేరాలకు’ (క్రైమ్స్ అగెనైస్ట్ హ్యుమానిటీ) పాల్పడ్డాయని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ 2013 ఏప్రిల్‌లో ఒక నివేదికలో తప్పుపట్టింది. 2012 అక్టోబర్‌లో రోహింగ్యాలపై దాడులు మొదలైన తర్వాతి నుంచి 2014 అక్టోబర్ వరకూ దాదాపు లక్ష మంది రోహింగ్యాలు బర్మా విడిచి వెళ్లిపోయారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ అంచనా వేసింది.



అయితే ఇప్పటివరకూ వలస వెళ్లిన రోహింగ్యాల సంఖ్య రెండు లక్షల వరకూ ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో బంగాళాఖాతం నుంచి దాదాపు 25,000 మంది పడవల్లో వలసలు వెళ్లారని.. వారిలో సగం మందికి పైగా.. రఖెనై రాష్ట్రం నుంచి బయల్దేరిన రోహింగ్యాలే ఉంటారని శరణార్థులపై ఐక్యరాజ్యసమితి దౌత్య కార్యాలయం పేర్కొంది.

 

ఓ చిన్న దేశం.. పెద్ద మనసు

ఆసియా దేశాలు పొరుగువారిపై కరుణ చూపటానికి నిరాకరిస్తుంటే.. కడు పేద దేశమైన గాంబియా మాత్రం ఎంతో పెద్ద మనసు చూపింది! బర్మా నుంచి వలస పోతూ సముద్రంలో చిక్కుకున్న వారందరి బాధ్యతనూ తాను తీసుకుంటానని ఆఫ్రికా ఖండంలోని ఈ పేద దేశం ప్రకటించింది. వారిని తమ దేశానికి పంపిస్తే శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఎందుకంటే.. ‘సాటి మానవులు, ముఖ్యంగా సాటి ముస్లింల కష్టాలు, కడగండ్లను తొలగించేందుకు సాయపడటం సాటి మానవులుగా, ముస్లింలుగా మన పవిత్ర కర్తవ్యం’ అని పేర్కొంది.



ఈ వలస జీవుల భారాన్ని మోసేందుకు దక్షిణాసియా దేశాలకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. ఫిలిప్పీన్స్ కూడా  సహాయం చేసేందుకు తన సంసిద్ధతను తెలిపింది.

 

పొరుగు దేశాలు ఏమంటున్నాయి?


రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల వలసలు పెరుగుతుండటంతో.. థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేసియాలు దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించాయి. ఈ ఏడాది మే నెలలో తమ తీరాలకు బోట్లలో వస్తున్న రోహింగ్యాలను వెనక్కు పంపటం మొదలుపెట్టాయి. ఏ దేశమూ వారిని తమ దేశంలో అడుగుపెట్టేందుకు వీలు లేదని నిరాకరించాయి. దీంతో వేలాది మంది అండమాన్ సముద్రం (బంగాళాఖాతం) పైనే చిక్కుకుపోయారు.



అసలే కడు పేదరికంలో ఉన్న ఈ వలస జనం.. బోట్లలో ఉన్న ఆహారం నిండుకోవటంతో ఆకలితో అలమటిస్తూ.. స్మగ్లర్లు వదిలేసి వెళ్లగా దుర్భరంగా గడుపుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నా రు. కొన్ని బోట్లు మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. ఈ నెల 10వ తేదీ నుంచి 3,600 మందికి పైగా వలస జనం.. ఇండొనేసియా, మలేసియా, థాయ్‌లాండ్ తీరాలకు కొట్టుకొచ్చారు. ఈ పరిణామాలు వెలుగుచూడటంతో అంతర్జాతీయ సమాజం దృష్టిసారించింది. ఈ వలసల సమస్యని పరష్కరించాలని స్థానిక దేశాలపై ఒత్తిడి పెరిగింది.



దీంతో.. ఆగ్నేయాసియా సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన వలసల పడవల కోసం సమీప దేశాల నౌకాదళ ఓడలు గాలింపు చేపట్టాయి. సముద్రంపై చిక్కుకుని ఉన్న దాదాపు 7,000 మందికి తాత్కాలిక ఆశ్రయం ఇస్తామని మలేసియా, ఇండోనేసియాలు అంగీకరించాయి. బోట్లను తిప్పి పంపటం నిలిపివేస్తామని.. బోట్లలో అనారోగ్యానికి గురైన వారికి తమ తీరంలో వైద్య చికిత్స అందిస్తామని థాయ్‌లాండ్ పేర్కొంది. అయితే.. వారి కోసం ఎటువంటి శిబిరాలనూ ఏర్పాటు చేయబోనని తేల్చిచెప్పింది. ఆస్ట్రేలియా మాత్రం వారి బాధ్యతను ఏమాత్రం తీసుకునేందుకు నిరాకరించింది.



‘ఎందుకంటే.. బోట్లపై బయలుదేరటానికి ఏ కొంచెం ప్రోత్సాహం లభించినా.. ఈ సమస్య మరింత ఉధృతమవుతుంది’ అని ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించారు. బర్మానే ఈ సమస్యను పరిష్కరించాలని థాయ్‌లాండ్, మలేసియా, ఇండొనేసియాలు చెప్తున్నాయి. సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించే బాధ్యతను మయన్మార్ కూడా పంచుకోవాలని.. కానీ ఆ దేశం అందుకు విముఖంగా ఉందని అమెరికా శనివారం తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన ప్రాంతీయ దేశాల ప్రభుత్వాలు థాయ్‌లాండ్‌లో సమావేశమై చర్చించాలని నిర్ణయించాయి.

 

మూల కారణాలను పరిష్కరించాలి: యూఎన్

‘‘మయన్మార్ నుంచి రోహింగ్యా ప్రజలు, బంగ్లాదేశ్ నుంచి వలసలు వేల సంఖ్యలో సముద్ర మార్గంలో పారిపోయేలా చేస్తున్న మానవ సంక్షోభం వెనుక గల మూలకారణాలను పరిష్కరించేందుకు ఆగ్నేయాసియా దేశాలు కృషి చేయాలి. మనుషుల ప్రాణాలను కాపాడటం ముఖ్యం. సముద్రంలో చిక్కుకుపోయిన వారి కోసం సహాయ చర్యలు చేపట్టాలి. పునరావాసం, పునఃసమ్మేళనంపై మయన్మార్, మలేసియా, థాయ్‌లాండ్ నేతలతో, ఇతర నేతలతోనూ చర్చిస్తున్నా’’ అని వియత్నాంలో పర్యటిస్తున్న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కిమూన్ శనివారం  పేర్కొన్నారు.          -సెంట్రల్ డెస్క్

 

బర్మా టు మలేసియా

వలస వెళ్లే రోహింగ్యాలు చాలా మంది తొలుత పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు వెళతారు. భూమార్గంలోనే అక్కడికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరింత మెరుగైన ఉపాధి కోసం.. సముద్ర మార్గంలో మలేసియా వెళ్లేందుకు సిద్ధమవుతారు. అలా వెళ్లే వారిలో బంగ్లాదేశీయులు కూడా ఉంటారు. ఇందుకోసం మనుషులను దొంగ రవాణా చేసే ముఠాలను ఆశ్రయిస్తారు. వారు వేలు, లక్షల రూపాయలు వసూలు చేసి.. చిన్న పడవల్లో సముద్రంపైకి తీసుకెళతారు. అక్కడ కాస్త పెద్ద పడవల్లో ఎక్కిస్తారు. ఒక్కరికి సరిపోయే చోట పది మందిని ఇరికిస్తారు.



కనీసం కాళ్లు కదపటానికి కూడా చోటుండదు. అలా సముద్ర మార్గం ద్వారా వీరిని థాయ్‌లాండ్ తరలించి.. అక్కడ రహస్య శిబిరాల్లో బంధిస్తారు. ఈ క్రమంలో వారిపై హింస, అత్యాచారాలకూ పాల్పడతారు. వారి బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసి వదిలిపెడతారు. వారు థాయ్‌లాండ్ నుంచి అటవీ మార్గంలో మలేసియాకు చేరుకుంటారు. దక్షిణాసియాలో కెల్లా (భారత్ కన్నా కూడా) మలేసియాలో తలసరి ఆదాయం ఎక్కువ. అందుకే అక్కడ కూలి పని చేసుకున్నా జీవితం సాఫీగా గడిచిపోతుందని రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఈ మార్గం ఎంచుకుంటున్నారు.

 

రోహింగ్యాలు ఎవరు?

ప్రధానంగా బర్మాలోని తూర్పు రఖెనై రాష్ట్రంలో నివసించే ముస్లిం మత మైనారిటీ ప్రజలు రోహింగ్యాలు. వీరిని భారతీయ-ఆర్య వర్గానికి చెందిన వారిగా చెప్తున్నారు. బర్మాలో జనాభా మొత్తం ఐదు కోట్లు ఉంటే.. వారిలో దాదాపు 13 లక్షల మంది రోహింగ్యాలు. కొందరు పరిశోధకులు వారు అక్కడే పుట్టిపెరిగిన స్థానిక జాతి ప్రజలని చెప్తుంటే.. భారత్, బర్మాల్లో బ్రిటిష్ పాలన కొనసాగుతున్నపుడు వీరు బెంగాల్ నుంచి బర్మాకు వ్యవసాయ కూలీలుగా వలస వచ్చారని చరిత్రకారులు చెప్తున్నారు.



రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యంలోని రోహింగ్యా ముస్లిం సైనికులకు - స్థానిక రఖెనై బుద్ధిస్టులకు మధ్య మత ఘర్షణ తలెత్తింది. అది క్రమంగా ముదిరి రెండు వర్గాలుగా చీలిపోవటానికి కారణమైంది. బర్మా 1948లో  స్వతంత్రం పొందింది. 1982లో సైనిక ప్రభుత్వం తెచ్చిన పౌర చట్టం.. రోహింగ్యా ప్రజలను దేశ పౌరులుగా గుర్తించలేదు. వీరిని ‘నివాస విదేశీయులు’గా వర్గీకరించారు. పౌరసత్వం లేదు కాబట్టి.. ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే హక్కు లేదు. ఆరోగ్య సే వలు అందవు. వీరి కదలికలపైనా ఆంక్షలున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top