ఆ అందాలభామకు చైనా నో పర్మిషన్

ఆ అందాలభామకు చైనా నో పర్మిషన్ - Sakshi


మిస్ కెనడా వరల్డ్ గా కిరీటం గెలిచి, మిస్ వరల్డ్ పోటీల్లో కెనడా తరపున పాల్గొనాల్సిన ఆ అందాలరాశికి ఇప్పుడు అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. పోటీలు మొదలవుతున్నా ఆమె మాత్రం చైనా చేరలేకపోయింది.  హాంకాంగ్ నుంచి చైనా వెళ్ళేందుకు ఫ్లైట్ ఎక్కాల్సిన ఆమెను అధికారులు అడ్డుకున్నారు. చైనా ప్రభుత్వ అభ్యంతరాలే అందుకు కారణంగా తెలుస్తున్నాయి.



ఈసారి మిస్ వరల్డ్ ఫైనల్స్ చైనాలో జరుగుతున్నాయి. అయితే కెనడానుంచి మిస్ వరల్డ్ గా పోటీ చేయాల్సిన  అనస్తాసియా లిన్ చైనాకు వెళ్ళడానికి అక్కడి సర్కారు ఒప్పుకోవడం లేదు. ఇంతకీ లిన్ పోటీకి చైనా ప్రభుత్వ అభ్యంతరాలకు లింక్ ఏంటీ అంటే... మానవహక్కులపై ఆమె చేస్తున్న ఉద్యమమేనట. ఆమె వ్యాఖ్యలే ఆమెను అందాలపోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేస్తున్నాయట. చైనాలో పుట్టి పెరిగిన లిన్... పదమూడేళ్ళ వయసులో కెనడాకు వెళ్ళి అక్కడే సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో నటిస్తూ ఉండిపోయింది. అదీ మానవ హక్కుల ఉల్లంఘనలపైనే ఎక్కువ క్యారెక్టర్లు చేసింది. ఇప్పుడు ఆమెకు 25 ఏళ్ళు. ఎంతో శ్రమపడి కెనడా మిస్ వరల్డ్ గా గెలిచిన ఆమెకు... ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వీసా రాలేదు. కారణం... ఆమెకు ఆహ్వానం అందకపోవడమే. అయితే ఆమె ఓ కెనడియన్ టూరిస్టులా స్పెషల్ ల్యాండింగ్ వీసాతో హాంకాంగ్ మీదుగా   సన్యా వెళ్ళేందుకు ప్రయత్నించినా ఎయిర్ పోర్టులో ఆమెను అడ్డుకున్నారు.







మిస్ వరల్డ్ టోర్నమెంట్ డిసెంబర్ 19 న చైనాలోని సాన్యా సముద్ర తీరం రిసార్ట్ లో జరగబోతోంది. 'నన్ను తిరస్కరించడం దురదృష్టకరం. ఇది పూర్తిగా ఊహించనిది కాదు. చైనీస్ ప్రభుత్వ రాజకీయ కారణాలతో పోటీనుంచి నన్ను నిరోధిస్తున్నారు' అంటూ లిన్ ఓ ప్రకటనలో తెలిపింది. తాను మానవ హక్కుల గురించి పోరాడటం చైనా ప్రభుత్వానికి అభ్యంతరంగా ఉంది. అందుకే తనను ఈ రకంగా శిక్షించాలని చూస్తున్నారు అంటుంది లిన్.



ఏది ఏమైనా మిస్ వరల్డ్ పోటీలు చైనాలో నిర్వహించడం ఇప్పుడు లిన్ కు ఎదురు దెబ్బ అయింది. మిగిలిన దేశాలవారికి పోటీలకు వీసాలిచ్చిన చైనా లిన్ కు ఆహ్వానం కూడ పంపలేదు. చైనాలో మానవ హక్కులను ఎలా అణచివేస్తున్నారో చెప్పడానికి తన విషయంలో జరిగిన ఈ ఘటనే పెద్ద ఉదాహరణ అంటోందామె. చైనాలో ఉంటున్న తన కుటుంబానికీ వేధింపులు ఎదురౌతున్నాయని, అయినా తాను పోరాటం ఆపేది లేదని తెగేసి చెప్తోందా అందాలరాణి లిన్.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top