ఇంకో పోలీసయితే కాల్చిపడేసేవారే..

ఇంకో పోలీసయితే కాల్చిపడేసేవారే.. - Sakshi

థాయిలాండ్‌‌: ప్రతి వ్యక్తిలో మంచి మనిషి ఉంటాడని, అది గుర్తించగలిగితే ఆ వ్యక్తిలోని రాక్షసత్వాన్నైనా ఇట్టే తీసిపారేయొచ్చని నిరూపించాడు ఓ పోలీసు అధికారి. అత్యంత ప్రమాదకరంగా మారిన ఓ వ్యక్తిని తను ఓ అద్భుతం చేసి తిరిగి మనిషిగా మార్చాడు. ఆయుధాన్ని వదిలేసి తాను చేస్తున్న పనికి సిగ్గుపడేలా చేశాడు. పైగా తన బాధను అర్థం చేసుకున్న ఆ పోలీసును గట్టిగా హత్తుకొని ఏడ్చాడు. ఈ దృశ్యం థాయిలాండ్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. అందులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ప్రకారం ఓ వ్యక్తి పొడవాటి కత్తితో పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి పలువురిని బెదిరించాడు.



దీంతో వణికిపోయిన పోలీసుల్లో కొంతమంది అతడిని కాల్చే ప్రయత్నం చేయగా వారిని వద్దని ఆపేసి అనిరుత్‌ మాలీ అనే పోలీసు అధికారి అద్భుతం చేశాడు. అతడిని మాటలతోనే సముదాయించాడు. ఆ వ్యక్తి తనకు తెలుసని అదే వ్యక్తితో చెప్పి తాను ఏం చేయబోనని కత్తిపక్కకు పడేసి తన దగ్గరకు రావాలని కోరాడు. పోలీసు మాటలు నమ్మిన ఆ వ్యక్తి నిజంగానే కత్తిని ఆ పోలీసుకే ఇస్తుండగా శంకర్‌దాదా సినిమాలో బాధ ఉన్న వ్యక్తిని నటుడు చిరంజీవి ఎలా హగ్‌ చేసుకొని ఓదార్చుతాడో అచ్చం అలాగే ఓదార్చాడు.



దీంతో అతడు కన్నీటి పర్యంతం అయ్యాడు. వాస్తవానికి అతడు ఓ సంగీతకారుడు. అయితే, అతడి గిటార్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు. దీంతో అతడికి వేరే మార్గం లేక మూడు రోజులుగా సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు. అయితే, పనిచేయించుకున్న వ్యక్తి అతడికి డబ్బు చెల్లించకపోవడంతో ఆ మానసిక ఒత్తిడిలో కత్తిపట్టుకొని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. అయితే, ఆ వ్యక్తిని దయగల పోలీసు కాస్త మళ్లీ మాములు వ్యక్తిలా మార్చాడు.  
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top