వైట్హౌస్ మూసివేత..

వైట్హౌస్ మూసివేత.. - Sakshi


వాషింగ్టన్: అగ్రరాజ్యాలపై ఉగ్రదాడుల నేపథ్యంలో ఓ ఆగంతకుడి చర్య అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ వద్ద కలకలం రేపింది. ప్రపంచంలోనే పటిష్ఠ భద్రత ఉండే ఆ నివాసం ఫెన్సింగ్ దూకి ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించడంతో అధికారుల గుండెల్లో బాంబులు పేలినట్లయింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినప్పుడు అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబంతో కలిసి లోపలే ఉన్నారు.




వందలాది సిబ్బంది, వేలాది సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, పైనుంచి ఉపగ్రహాలు.. డేగ కంటే తీక్షణమైన నిఘాను దాటుకుని అగంతకుడు లోనికి ప్రవేశించడంతో క్షణం ఆలస్యం చేయకుండా లోపలున్న అధ్యక్షుణ్ని, అతడి కుటుంబాన్ని సురక్షిత స్థావరానికి తరలించడం, అటుపై గోడ దూకిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది.


విస్తృత తనిఖీల అనంతరం ఆ అగంతకుడిని జోసెఫ్ క్యాపుటోగా గుర్తించారు. ఇతడు పలు నేరాల్లో దోషిగా నిరూపితుడై రెండు మూడు సార్లు జైలుకు వెళ్లొచ్చాడు. అయితే అధ్యక్ష భవనంలోకి ఎందుకు చొరబడింది ఇంకా తెలియరాలేదు. విచారణ కొనసాగుతుందన్న వైట్ హౌస్ అధికారులు.. తాత్కాలికంగా అధ్యక్ష భవనాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించారు.



అన్నట్లు వైట్ హౌస్ లోకి ఆగంతకుల ప్రవేశం ఇది మొదటిసారి కాదట. గతేడాది కూడా మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఫెన్సింగ్ దూకి అధ్యక్ష భవనంలోకి చొరబడ్డాడట. గత వారం ఓ మహిళ.. వైట్ హౌస్ ఫెన్సింగ్ మీదికి యాపిల్ పండు విసిరి కలకలానికి కారణమైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top