ఫ్రెంచ్‌ పోరులో చిచ్చర పిడుగు!

ఫ్రెంచ్‌ పోరులో చిచ్చర పిడుగు! - Sakshi


ఫ్రాన్స్‌ అధ్యక్ష పదవికి మే7న జరిగే నిర్ణాయక, తుది దశ ఎన్నికల్లో ఎన్‌ మార్చ్‌(ముందడుగు) పార్టీ అభ్యర్థి ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ గెలుస్తారని సర్వేలన్నీ సూచిస్తూన్నా  మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాదిరిగా అంచనాలు తారుమారవుతాయేమోననే భయాలు కూడా ఫ్రెంచి ప్రజలను  వెంటాడుతున్నాయి. విదేశీయులు, వలసదారులను తీవ్రంగా ద్వేషించే మితవాద పక్షం నేషనల్‌ ఫ్రంట్‌(ఎఫ్‌ఎన్‌) అభ్యర్థి మరీన్‌ లాపెన్‌ విజయం సాధిస్తారేమోననే అనుమానం పూర్తిగా పోలేదు. మొదటి దశ ఎన్నికల్లో మరీన్‌ 21.4 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. గెలుపు ఖాయమనుకుంటున్న మాక్రాన్‌ 23.9 శాతం ఓట్లతో మొదటి స్థానం సాధించారు.  రాజ్యాంగ నిబంధన ప్రకారం తొలిదశ ఎన్నికల్లో మొదటి రెండు స్థానాలు సాధించిన ప్రధాన అభ్యర్థులే తుది ఎన్నికల్లో పోటీ పడతారు.


మరీన్‌ గెలిస్తే ఈయూకు గుడ్‌బై!

యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో కొనసాగే విషయంపై తాను గెలిస్తే బ్రెగ్జిట్‌ తరహా జనాభిప్రాయసేకరణ(రెఫరెండం) జరిపిస్తానని మరీన్‌ చెబుతున్నారు. మరీన్‌ గత రెండు దశాబ్దాలుగా జాత్యహంకార మాటలతో శ్వేతేతర జాతులవారిని భయపెడుతున్న జీన్‌ లాపెన్‌ కూతురు. ఆమెకు ట్రంప్‌ పరోక్షంగా మద్దతు ఇస్తుండగా, ఆయన విధానాలను మరీన్‌ సమర్ధిస్తున్నారు. కిందటేడాది ఆగస్టు వరకూ పాలకపక్షం సోషలిస్ట్‌పార్టీలో, ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగి, రెండింటి నుంచి వైదొలిగిన 39 ఏళ్ల మాక్రాన్‌ ‘ఎన్‌ మార్చ్‌’ అనే లిబరల్‌ పార్టీ స్థాపించి అధ్యక్ష ఎన్నికల రంగంలోకి దూకారు. తనకన్నా వయసులో పాతికేళ్లు పెద్దదైన తన మాజీ టీచర్‌ బ్రిజెట్‌ను పెళ్లాడి 9 ఏళ్ల క్రితం ఆయన సంచలనం సృష్టించారు.




మాక్రాన్‌దే గెలుపంటున్న సర్వేలు!

ప్రఖ్యాత బ్రిటిష్‌ మీడియా సంస్థ ‘ది ఇండిపెండెంట్‌’ జరిపించిన సర్వే ప్రకారం మాక్రాన్‌ 63.1 శాతం ఓట్లతో మరీన్‌(36.9 శాతం)పై భారీ విజయం సాధిస్తారని అంచనావేశారు. మరో పోలింగ్‌ సంస్థ హారిస్‌– మాక్రాన్‌ 64 శాతం, మరీన్‌ 36 శాతం ఓట్లు సాధిస్తారని తెలిపింది. తొలిదశ పోరులో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య తేడా కేవలం 2.3 శాతమేగాని ‘ఫైనల్‌ వార్‌’లో మాక్రాన్‌ గెలుపునకు తిరుగులేదని ఫ్రెంచ్‌ రాజకీయ పండితులు భావిస్తున్నారు. మే 7లోగా మాక్రాన్‌కు సంబంధించిన ‘భారీ కుంభకోణం’ ఏదైనా బయటిపడి బద్దలైతే తప్ప ఆయన సునాయాసంగా గెలుస్తారని అత్యధిక పరిశీలకులు నమ్ముతున్నారు.  ‘‘మరీన్‌ ప్రజలను జాతి, రంగు వంటి అంశాలతో చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే గెలుపునకు అవసరమైన మెజారిటీ ప్రజల మద్దతు ఆమెకు దక్కదు’’అని ఫ్రాన్స్‌ రాజకీయాలను క్షుణ్నంగా గమనించే లండన్‌ క్వీన్‌ మేరీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రెయిన్‌బో మరి చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేలన్నీ డెమొక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ గెలుస్తారని చెప్పగా, చివరికి ఎలక్టొరల్‌ కాలేజీ విధానం ఫలితంగా ట్రంప్‌ గెలిచినట్టు ఫ్రెంచ్‌ తుది పోరు కూడా దిగ్భ్రాంతి కలిగించే తీర్పుకు దారితీస్తుందేమోనని కొందరు భయపడుతున్నారు.


(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top