ముషార్రఫ్‌కి మరో ఝలక్

ముషార్రఫ్‌కి మరో ఝలక్

లండన్‌: పాకిస్థాన్‌ మాజీ సర్వసైన్యాధక్షుడు, ఆల్‌ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ వ్యవస్థాపకుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌కి మరో పరాభవం ఎదురైంది. లండన్‌లోని ఓ యూనివర్సిటీలో ఆయన నేతృత్వంలో జరగాల్సిన ఓ చర్చా కార్యక్రమానికి అనుమతి నిరాకరించింది. 

 

పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ ఛానెల్‌ ఈనెల 24న  ముషార్రఫ్‌తో ముఖాముఖిని ఏర్పాటుచేసింది . లండన్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్ ఆఫ్రికన్‌ స్టడీస్‌ విద్యాలయాన్ని వేదికగా ఎంచుకుంది. తనపై పడిన అనర్హత వేటుతోపాటు ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలపై ముషార్రఫ్‌ ప్రసంగించాల్సి ఉంది. ఇంతలో పలు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ వెనక్కి తగ్గింది. 

 

 

‘‘ముషార్రఫ్‌పై నమోదైన అభియోగాల నేపథ్యంలో ఇంటర్వ్యూకు అనుమతించటం ద్వారా తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉంది. ఒక రకంగా పాకిస్థాన్‌లో జరిగిన నేరాలకు, హింసకు మరియు మిలిటరీ తిరుగుబాటులకు ఈ విద్యాలయం పరోక్షంగా మద్ధతు తెలిపినట్లే అవుతుంది. అందుకే ఆయన ఇంటర్వ్యూకు అనుమతి నిరాకరించాలి’’ అని పలు ప్రగతిశీల గ్రూపులకు చెందిన పాకిస్థాన్‌ నేతలు ఎస్‌ఓఏఎస్‌ కు లేఖ రాశారు.

 

ఆయన(ముషార్రఫ్‌) ప్రసంగిస్తే నిరసన తెలిపేందుకు ఓ మూడు సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. తద్వారా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.  పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఆయన కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నామని యూనివర్సిటీ ఓ ప్రకటనలో  తెలిపింది. అదే సమయంలో ఈ కార్యక్రమంలో తన బుక్‌ను ముషార్రఫ్‌తో ఆవిష్కరింపజేయాలనుకున్న ఓ రచయిత కూడా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడని సమాచారం. ఇంతకు ముందు నోబెల్‌ శాంతి సెంటర్‌ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ పాక్‌ మాజీ నియంత పాల్గొనగా, నిరసనలు వ్యక్తం కావటంతో కార్యక్రమం మద్య నుంచే ఆయన వెళ్లిపోయారు. 
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top