ఐఎస్‌ఐఎస్ భారీ వ్యూహం బట్టబయలు

ఐఎస్‌ఐఎస్ భారీ వ్యూహం బట్టబయలు


సిరియా, ఇరాన్ దేశాలతో పాటు ఇరాక్ ప్రాంతాలను పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులు భారీ వ్యూహాన్నే పన్నారు. అమెరికా, ఐరోపా దేశాల సైన్యం నుంచి ఎదురయ్యే సవాళ్లను ముందుగానే ఊహించి.. శత్రు సైనికులను తుదముట్టించేందుకు సకల విధాలుగా సంసిద్ధులైనట్లుగా ఇరాక్‌లోని సింజార్ నగరంలో బయటపడిన దాదాపు 50 సొరంగ మార్గాలు స్పష్టం చేస్తున్నాయి. సైన్యం వైమానిక మార్గంలో దాడిచేస్తే.. సురక్షితంగా దాక్కోడానికి వీలుగా వీటిని ఏర్పాటుచేసుకున్నట్లు తెలుస్తోంది.



ఆ సొరంగ మార్గాల్లో విద్యుత్ సౌకర్యం, పడుకునేందుకు వెసలుబాటు, రక్షణ కోసం ఇసుక సంచులు, అమెరికా తరహా బాంబులను తయారు చేసేందుకు అవసరమైన పరికరాలు, అత్యవసరమైన మందుల నిల్వలు, ఖురాన్ ప్రతులు లభించాయి. అన్నింటికన్నా శత్రువుల యుద్ధ విమానాల దాడులను తట్టుకునేందుగా వీలుగా ఈ సొరంగ మార్గాలను నిర్మించడం విశేషం. నగరంలోని ప్రతి మూలకు వెళ్లడమే కాకుండా సిరియా ప్రాంతాల్లోకి సులభంగా జారుకునేలా ఉన్నాయని ఇరాకీ కుర్దిష్ యోధులకు చెందిన సింజార్ కమాండర్ శ్యామో ఎయాదో తెలిపారు. ఏడాది కాలంగా ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులతో యుద్ధం చేస్తూ ఇటీవలే ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ సొరంగాలు బయట పడ్డాయని ఆయన తెలిపారు.



ఇలాంటి సొరంగాలను ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులు నిర్మిస్తారని ఇంతవరకు ఊహించలేక పోయామని, అమెరికా సంకీర్ణదళాలు గతేడాది ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులపై దాడులు జరపడానికి ముందే ఈ సొరంగాల నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలుస్తోందని అరబ్ సంస్కరణల మేధావుల సంఘానికి చెందిన సీనియర్ సభ్యుడైన లీనాఖాతిబ్ మీడియాకు తెలిపారు. రెండు సొరంగాలు వంద మీటర్ల దూరం దాకా ఉన్నాయని చెప్పారు. వాటి పక్కన యాజ్దీ తెగకు చెందిన బందీలను పాతిపెట్టిన సామూహిక సమాధులు కూడా బయటపడ్డాయని ఆయన చెప్పారు.


Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top