92 ఏళ్ల బామ్మ...నాలుగో తరగతి

92 ఏళ్ల బామ్మ...నాలుగో తరగతి


నైరోబి: చదువుకోవడానికి వయసుతో ప్రమేయం లేదు. ఉత్సాహం ఉంటే ముదిమి వయసులో కూడా ముచ్చటగా చదువుకోవచ్చని కెన్యాకు చెందిన 92 ఏళ్ల బామ్మ ప్రిసిల్లా సిటియెనీ అక్షరాల నిరూపిస్తున్నారు. ఆఫ్రికాకు చెందిన కెన్యా దేశం వలసపాలనలో మగ్గుతున్నప్పుడు చారిత్రక, సామాజిక కారణాల వల్ల ప్రిసిల్లా చదువుకోలేకపోయారు. ఐదేళ్ల క్రితం బోర్డింగ్ స్కూల్లో చేరిన బామ్మ ప్రిసిల్లా ప్రస్తుతం నాలుగో గ్రేడ్ చదువుతూ చదువుకోని తన తరానికి నూతన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘నాకు మనమలు, మనమరాళ్లే కాకుండా ముని మనుమలు, ముని మనమరాళ్లు కూడా ఉన్నారు.



వారిలో కొంతమంది బడికెళ్లి చదువుకోవడానికి మారాం చేస్తున్నారు. ఇది చూసి నాకు చికాకేసింది. చదువుకున్న ప్రాముఖ్యతేమిటో ప్రాక్టికల్‌గా వారికి చెప్పాలనుకున్నాను. అందుకే నేను చదువుకోవడానికి బడిలో చేరాను’ అని ప్రిసిల్లా మీడియాకు తెలిపారు. ఆమె వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని బోర్డింగ్ స్కూలు వారు వసతికి ఆమెకు ఓ ప్రత్యేక గదిని కూడా కేటాయించారు. చదువును తోటి విద్యార్థినీ విద్యార్థులతోనే కొనసాగిస్తున్నారు.



గిన్నీస్ బుక్‌ను సవరిస్తే అత్యంత వృద్ధురాలైన ఎలిమెంటరీ విద్యార్థినీగా ప్రిసిల్లాకే పట్టా ఇవ్వక తప్పదు. ప్రస్తుతం ఈ రికార్డు కెన్యాకే చెందిన కిమనీ మారుగ్ పేరిట ఉంది. ఆయన 2009లో తన 90వ ఏట చనిపోయారు. అత్యంత వృద్ధుడైన ఎలిమెంటరీ విద్యార్థిగా ఆయన 2004లోనే గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. కెన్యా వలసపాలనలో ఉండడం వల్ల ప్రిసిల్లా పుట్టిన రోజుకు సంబంధించిన రికార్డులు లేవు. అయితే తాను 1923లో పుట్టానని, తనకిప్పుడు 92 ఏళ్లని ఆమె చెబుతున్నారు. ‘నాకు లెక్కలంటే చాలా చాలా ఇష్టం. పిల్లల సుఖ ప్రసవం కోసం తాను సాయంచేసే గర్బిణిలకు మందులు ఏ సమయంలో ఎంత మోతాదులో ఇవ్వాలో ఇప్పుడు నాకు బాగా తెల్సిందీ’ అని ఆమె చెప్పారు. ఇంకా చదుకుకోవాల్సిందీ ఎంతో ఉందని అన్నారు.



ఆకాలం నాటి సామాజిక పరిస్థితుల కారణంగా ఆమె పిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు. పది మంది పిల్లల్ని కన్నారు. వారిని పెంచి పెద్దవారిని చేయడంతోనే ఆమె జీవితం గడిచింది. ఆ రోజుల్లోనే చదుకోవాలనే ఆశ ఎక్కడో ఉన్నప్పటికీని అప్పటి సామాజిక పరిస్థితుల కారణంగా చదువుకోలేక పోయానని ఆమె నాటి రోజులను మననం చేసుకుంటూ చెప్పారు. అప్పట్లో స్త్రీలు చదువుకోవడాన్ని ప్రోత్సహించేవారు కాదని, డబ్బు, సమయం రెండూ వృధా అంటూ నిరుత్సాహపరిచేవారని తెలిపారు.  ప్రిసిల్లాను చూసి తమ పాఠశాల పిల్లల్లో బాగా చదువుకోవాలనే తపన పెరిగిందని బోర్డింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ డేవిడ్ కిన్యాంజూయి చెప్పారు. లెక్కలతోపాటు సైన్స్‌లో అమితాసక్తి చూపే ప్రిసిల్లా పాఠశాల పిల్లలకు మంచి మంచి కథలు చెబుతారని, ఆ పిల్లలతో కలిసి వ్యాయామ పాఠాలకు కూడా హాజరుతారని ప్రిన్సిపాల్ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top