ఈ శిఖరం నుంచి దూకినా.. ఏమీ కాదు!

ఈ శిఖరం నుంచి దూకినా..  ఏమీ కాదు!


నిట్టనిలువునా కిలోమీటరుకు కొంచెం తక్కువగా ఉన్న ఈ కొండ శిఖరం మీది నుంచి దూకినా.. పారాచుట్‌తో ల్యాండ్ అయినట్లు హాయిగా ఉంటుందట. మనకు దెబ్బలేమీ తగలవట. ఎందుకంటే.. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా స్వల్పంగానే ఉంటుంది.



బాగుందే.. ఎక్కడుందంటారా? ‘67పీ/చుర్యుమోవ్ గెరాసిమెంకో’ అనే తోకచుక్కపై! ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) పదేళ్ల క్రితం ప్రయోగించిన రోసెట్టా వ్యోమనౌక వందల కోట్ల కి.మీ. ప్రయాణించి ఈ ఏడాది ఆగస్టులోనే ఈ తోకచుక్కను చేరింది. అప్పటి నుంచి ఈ తోకచుక్క చుట్టూ తిరుగుతూనే భూమికి ఫొటోలు పంపుతోంది.



అలా ఈ నెల 10న 20 కి.మీ. దూరం నుంచి రోసెట్టా తీసిన నాలుగు ఫొటోలను కలిపి ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ అట్కిన్సన్ అనే ఔత్సాహిక ఖగోళ పరిశోధకుడు ఈ ఫొటోను రూపొందించారు. అన్నట్టూ.. 4 కి.మీ. సైజు కొండలా ఉన్న ఈ తోకచుక్క ప్రస్తుతం గంటకు లక్ష కి.మీ. వేగంతో ప్రయాణిస్తోందట. దీనిపైకి ఫీలే అనే ల్యాండర్‌ను నవంబరు 12న జారవిడిచి రోసెట్టా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top