అమెరికా సైనికుడే వారికి దేవుడు

అమెరికా సైనికుడే వారికి దేవుడు - Sakshi


పోర్టువిలా: అమెరికా సైనికులు వారిని ఎప్పుడో మరచిపోయారు. ‘జాన్ ఫ్రమ్’ కార్గో తెగవారు మాత్రం వారిని ఇప్పటికీ మరచిపోలేక పోతున్నారు. అమెరికా సైనికులకు ప్రతినిధిగా భావిస్తున్న ‘జాన్ ఫ్రమ్’ను దేవుడిలా కొలుస్తారు. పూజలు చేస్తారు. జీసస్‌కంటే శక్తివంతమైన దేవుడంటారు. ప్రతి శుక్రవారం అమెరికా జెండాను ఎగరవేస్తారు.


ప్రతి ఫిబ్రవరి 15వ తేదీన మౌంట్ యాసుర్ అనే ట్రైబల్ గ్రామంలో అమెరికా జెండాను ఎగరవేసి సైనిక కవాతు నిర్వహిస్తారు. వాయుద్యాలు, నృత్యాలతో పెద్ద ఎత్తున పండగ చేసుకుంటారు. ఏదోరోజు జాన్ ఫ్రమ్ వస్తాడని, అమెరికా నుంచి అపార ధనరాశులను, కోకకోల లాంటి అనేక బహుమతులు తీసుకొస్తారని ఎదురు చూస్తారు. రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచి వారు ఇలాగే నిరీక్షిస్తున్నా జాన్ ఫ్రమ్ మాత్రం రావడం లేదు.



మౌంట్ యాసుర్ ట్రైబల్ గ్రామం దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని వనౌతు దీవుల సముదాయంలోని టన్నా దీవిలో ఉంది. ఇది ఆస్ట్రేలియాకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దీవిలో జాన్‌ఫ్రమ్ తెగవారు దాదాపు ఆరువేల మంది నివసిస్తున్నారు. వారి అసలు తెగ పేరు ఎవరికి తెలియకుండా చరిత్రగర్భంలో కలసిపోయింది. జాన్ ఫ్రమ్ తెగగానే వారికి గుర్తింపు వచ్చింది. అమెరికా సైనికులు తమను తాము ‘ఐ యామ్ జాన్ ఫ్రమ్ మియామి....ఐ యామ్ జాన్ ఫ్రమ్ కాలిఫోర్నియా’ అంటూ పరిచయం చేసుకుంటారు. అందుకని ఈ తెగ వారు అమెరికా సైనికులను ‘జాన్ ఫ్రమ్’గానే గుర్తు పెట్టుకున్నారు.



బ్రిటీష్, ఫ్రెంచ్ పాలనలో ఈ తెగ వాళ్లు అష్టకష్టాలు అనుభవించారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా 1940 దశకంలో భారీ ఎత్తున ఆహార పదార్థాలు, చమురు నిల్వలతో అమెరికా నేవీ సైన్యం ఈ దీవికి తరలివచ్చింది. వారు అక్కడ రెండో ప్రపంచ యుద్ధం ముగిసేవరకు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఈ సందర్భంగా తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. విమానాల రాకపోకలకు ఎయిర్‌స్ట్రిప్‌లను కూడా నిర్మించారు. ఆ సందర్భంగా వారు ఇక్కడి గిరిజన తెగను మచ్చిక చేసుకున్నారు. వీరికి అవసరమైన ఆహారాన్ని, వైద్య చికిత్సను అందించారు. తమ వెంట తెచ్చిన బహుమతులను ఇచ్చారు.



అందుకని వారిని జాన్ ఫ్రమ్ తెగవారు ఇప్పటికి మరచిపోలేక పోతున్నారు. రేడియోలు, టీవీలు, ఐస్‌బాక్సులు, కోకకోలాలు బహుమతులు తెస్తారని ఇప్పటికీ ఆ గిరిజనులు చెబుతుంటారు.  వారిలో పూర్తిగా గిరిజన సంస్కృతే కనిపిస్తున్నప్పటికీ నాగరికలతో కలుపుగొలుపుగానే ఉంటారు. అందుకని అడపాదడపా పర్యాటకులు అక్కడికి వస్తూ పోతుంటారు. వారి నృత్యాల్లో భాగం పంచుకుంటూ ఉంటారు. ఈసారి కూడా వారు ఫిబ్రవరి 15వ తేదీన అమెరికా జెండా ఎగరేసి పండుగ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top