అమెరికన్లకు కూడా ఉద్యోగాల ముప్పు

అమెరికన్లకు కూడా ఉద్యోగాల ముప్పు - Sakshi


న్యూయార్క్‌: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం అక్రమవలసదారులను దేశం నుంచి వెనక్కి పంపిస్తానని పదే పదే చెబుతున్నారు. ఎన్నికల్లో ఆయన విజయానికి కూడా ఈ ప్రచారం ఎంతగానో దోహద పడింది. ఆయనకు తెలియకుండా అమెరికన్లకు ఉద్యోగాలు పోయే మరో గండం పొంచి ఉందని, అది వలసదారులకన్నా ప్రమాదరంగా మారనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే యాంత్రీకరణ (ఆటోమేషన్‌).



ఇంతకాలం మనుషులు చేస్తూ వస్తున్న పనిని ఇక కంప్యూటర్లు, రోబోలు చేయడమే ఆటోమేషన్‌. ప్రపంచీకరణ వల్ల పోయిన ఉద్యోగాలకన్నా ఆటోమేషన్‌ వల్ల ఎక్కువ ఉద్యోగాలు పోతాయని, ఇంతకుముందు ఆటోమేషన్‌ వల్ల ఓ చోట ఉద్యోగాలు పోతే మరో చోట కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చేవని, ఇకముందు అలా జరిగే అవకాశం లేదని మ్యాక్‌ కిన్‌సే, డరాన్‌ ఏస్‌మొగ్లూ, డేవిడ్‌ ఆటర్‌ లాంటి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క ఉక్కు రంగంలో వచ్చిన ఆటోమేషన్‌ వల్ల అమెరికా ఉక్కు పరిశ్రమలో 1962 నుంచి 2005 వరకు దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు పోయాయని, అంటే కార్మికుల సంఖ్య 75 శాతం తగ్గిందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.



ప్రపంచీకరణ నేపథ్యంలో చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఎన్నో దేశాలు తమ ఉద్యోగాలను కోల్పోయాయి. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల సంఖ్య 20 లక్షల నుంచి 24 లక్షల వరకు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనావేశారు. ఈ నేపథ్యంలో దేశీయ ఉద్యోగాలు మెక్సికోకు తరలిపోకుండా ఉండేందుకు అమెరికాలోని యునైటెడ్‌ టెక్నాలజీస్‌ కంపెనీతో ఇటీవల డోనల్డ్‌ ట్రంప్‌ ఓ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా కంపెనీ 160 లక్షల డాలర్లను అదనంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇందులో ఎక్కువ నిధులను ఆటోమేషన్‌ కోసమే వెచ్చించనున్నారు. అంటే భవిష్యత్తులో ఈ కంపెనీలో కూడా ఉద్యోగావకాశాలు తగ్గిపోనున్నాయి.





ఒకప్పుడు కార్మికులు చేసే శరీర కష్టమే ఆ తర్వాత యంత్రాలు చేస్తూ వచ్చాయి. ఇప్పుడు వైట్‌ కాలర్‌ జాబ్స్‌తోపాటు సేవారంగం పనులను కూడా కంప్యూటర్లు, రోబోలు చక్కగా చేయగలడమే మానవ ఉద్యోగాలకు ఎసరు తెస్తోంది. కొంతమేరకు ఒకచోట పోయిన ఉద్యోగాలు, మరో చోట పుట్టుకొని రావచ్చు. అయితే అలాంటి ఉద్యోగాలు మరో తరానికి ఉపయోగపడతాయిగానీ, ప్రస్తుత తరానికి ఉపయోగపడకపోవచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జపాన్, చైనా లాంటి దేశాల్లోని కొన్ని హోటళ్లలో బిల్లింగ్‌ నుంచి సర్వింగ్‌ వరకు అన్ని పనులుచేసే రోబోలు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top