దుస్తులు సరిగా లేవని ప్రయాణికురాలిని...

దుస్తులు సరిగా లేవని ప్రయాణికురాలిని... - Sakshi


బోస్టన్: విమానం ఎక్కడానికి వచ్చిన ప్రయాణికురాలికి ఎయిర్ లైన్స్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె దుస్తులు సరిగా లేవన్న కారణంగా విమానంలో కాలు పెట్టేందుకు అభ్యంతరం చెప్పారు. మసాచుసెట్స్ లోని లోగాన్ ఎయిర్ పోర్టులో కొన్ని రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాగీ మెక్ మఫ్ఫీన్ లోగాన్ లో జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించి బోస్టన్ చేరుకుని, అక్కడ కనెక్టింగ్ ఫ్లయిట్ అందుకుని న్యూయార్క్ కు వెళ్లాల్సి ఉంది.



ఆమె ఓ స్వెట్టర్, చిన్న షార్ట్ వేసుకుందని, పొడవాటి సాక్సు ధరించి ఉందని జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. సీటెల్ కు చెందిన మాగీ మరీ పొట్టి దుస్తులు వేసుకుని వచ్చిందని, ఆమెను దుస్తులు మార్చుకోవాల్సిందిగా సూచించారు. లేనిపక్షంలో విమానం ఎక్కేందుకు ఆమెను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేం లేక మాగీ.. వేరే టర్మినల్ కు వెళ్లి 22 డాలర్లు ఖర్చుపెట్టి కొత్త షార్ట్స్ కొనుక్కుంది. ఆ తర్వాత హాయిగా ప్రయాణించి బోస్టన్ చేరుకుంది.



రూల్స్ లో ఈ విషయాలు లేకున్నా తనను అడ్డుకున్నారని మాగీ చెప్పింది. ఎగతాళి చేసేలా లోగోలు, ఫొటోలు ఉన్న దుస్తులు ధరిస్తే ఎయిర్ లైన్స్ నియమాలకు విరుద్ధమని అధికారులు వెల్లడించారు. తనను విమానం ఎక్కకుండా గేట్ వద్దే నిలిపివేసినందుకు సిబ్బంది క్షమాపణలు చెప్పిందని బాధిత ప్రయాణికురాలు స్థానిక మీడియాకు వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top