ఆ గుడికి వెళ్తే గొడవెందుకు?

ఆ గుడికి వెళ్తే గొడవెందుకు?


జపాన్ ప్రధానమంత్రి షింజో అబే యాసుకుని మందిరానికి వెళ్లడం మళ్లీ వివాదానికి దారి తీసింది. ఆ గుడికి ఎందుకు వెళ్లారంటూ చైనా, కొరియా వంటి దేశాలు జపాన్ పై నిప్పులు కురిపించాయి. 'అది మా వీరుల గుడి. అక్కడికి వెళ్తే గొడవెందుకు' అంటూ జపానీయులు కౌంటర్ ఇస్తున్నారు.



యాసుకుని మందిరం అంటే ఏమిటి?

టోక్యో నగరంలో ఉన్న యాసుకుని మందిరంలో జపాన్ కోసం పోరాడి అమరులైన వారి అవశేషాలున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం లో చనిపోయిన వారి స్మృతిలో ఈ మందిరాన్ని నిర్మించారు. యాసుకుని అంటే దేవుళ్లు లేదా మహాత్ములుండే చోటు అని అర్ధం. ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు స్కూలు టూర్లలో ఈ మందిరాన్ని దర్శిస్తూంటారు.

 

ఈ మందిరం ఎందుకు వివాదాస్పదం?

రెండో ప్రపంచ యుద్ధంలో 24 లక్షల మంది జపాన్ సైనికులు చనిపోయారు. వీరిలో వెయ్యి మందిని  అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రిబ్యునల్ నరహంతకులుగా పరిగణిస్తుంది. వీరు కొరియా, చైనా వంటి దేశాల్లో కిరాతకాలకు పాల్పడ్డారన్నది వీరిపై ఆరోపణ. అందుకే జపాన్ నేతలు ఎవరైనా ఈ మందిరానికి వెళ్తే కొరియా, చైనా, తదితర ఆగ్నేయాసియా దేశాలు భగ్గుమంటాయి. తమ దేశాల్లో కిరాతకాలకు పాల్పడ్డ నరహంతకులకు జపాన్ నివాళులు అర్పించడం ఏమిటని ఆ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది జపాన్ యుద్ధ కాంక్షకు నిదర్శనం అని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి.



జపాన్ వాదనేమిటి?

యుద్ధంలో పరాజితులైన వారిని నేరస్తులుగా పరిగణించడం తప్పన్నది జపాన్ వాదన. విజేతలు చేసిన అకృత్యాల మాటేమిటని జపాన్ ప్రశ్నిస్తోంది. జపాన్ పై అణుబాంబులు వేసిన వారు ఎందుకు యుద్ధ నేరస్తులు కారన్నది జపాన్ వాదన. మా దేశం కోసం చనిపోయిన వారికి నివాళి అర్పించడంపై వివాదమెందుకు అటోంది జపాన్.

 


షింజో అబే రాజకీయం


జపాన్ ప్రధాని షింజో అబే తొలినుంచీ యాసుకుని మందిరం విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ప్రతి ఏటా ఆయన ఈ మందిరానికి వెళ్లడం లేదా పుష్పగుచ్ఛాలను పంపడం వంటివి చేస్తూన్నారు. దీనిపట్ల అమెరికా సైతం అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. షింజో అబే తండ్రి నోబుసుకే కిషి కూడా ఇలాంటి యుద్ధ ఖైదీయే. ఆయన తరువాత జపాన్ ప్రధాని కూడా అయ్యారు. షింజోకి ఈ ఆలయ దర్శనం రాజకీయంగా కూడా లాభాన్నిస్తుంది. మొత్తం మీద ఆలయ దర్శనం వివాదాస్పదం అవుతోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top