వారికి యుద్ధమంటే అప్పుడే తెలుస్తోంది

వారికి యుద్ధమంటే అప్పుడే తెలుస్తోంది


అమృత్ సర్: అక్కడ గన్ పేలలేదు.. ఎలాంటి అప్రమత్తత సంకేతాలు అందలేదు. ఫైటర్ జెట్ బాంబులు అంతకంటే లేవు. వాస్తవానికి ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయం కూడా కాదు. కానీ వేల పంజాబ్ లోని వేల కుటుంబాలు మాత్రం అప్పుడే యుద్ధం అంటే ఎలా ఉంటుందో.. యుద్ధం వస్తే ఎలాంటి పరిస్దితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చవిచూస్తున్నారు. పాక్ సరిహద్దకు ఆనుకొని ఉన్న పంజాబ్ గ్రామాలన్నింటిని ఆర్మీ ఖాళీ చేయిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలోని గ్రామాలన్నింటిని ఏ ఒక్కరూ లేకుండా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.



ఓ అంచనా ప్రకారం అమృత్ సర్, తార్న్ తరన్, ఫిరోజ్ పూర్, గురుదాస్ పూర్, పఠాన్ కోట్, ఫజిల్కా జిల్లాలకు చెందిన దాదాపు 4 లక్షలమందిని  ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు వెయ్యి గ్రామాల్లోని ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు అందడంతో ఆ పని పూర్తి చేయిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ భూభాగంలోకి భారత ఆర్మీ చొచ్చుకెళ్లి దాడులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది.



ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు అనూహ్యంగా తమ నివాసాలను వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 'మేం మా వస్తువులన్నింటిని మూటగట్టి ట్రాక్టర్లో వేశాం. కాని ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. కానీ తప్పకుండా వెళ్లాల్సి ఉంది. మరో పది రోజుల్లో మా పంటపొలాలు తూర్చాల్సి ఉంది. త్వరలోనే పరిస్ధితి సర్దుమణుగుతుందని మేం ఆశిస్తున్నాం' అని తమ నివాసాలను విడిచి వెళుతున్న కొంతమంది రైతులు, వ్యక్తులు చెప్పారు. ఇప్పటికే అక్కడి పాఠశాలలు, ఆస్పత్రులు కూడా ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. తాజా దాడుల వల్ల సరిహద్దు వెంట నుంచి మొత్తం 15లక్షలమందిని ఆయా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.





Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top