చేసిన సాయం చాలు.. ఇక ఆపండి!

చేసిన సాయం చాలు.. ఇక ఆపండి! - Sakshi


కఠ్మాండు: పెను భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ దేశం అంతర్జాతీయంగా చిన్న చూపును ఎదుర్కొంటుందా?, భూకంప సహాయక చర్యల్లో భారీ స్థాయిలో దేశాలు పాల్గొనడం నేపాల్ ప్రతిష్టకు భంగం వాటిల్లేదిగా ఉందా? అంటే అవునక తప్పదు. నేపాల్ సహాయక చర్యలను విరమించి వెనక్కివెళ్లిపోవాలనే అక్కడి ప్రభుత్వం తాజాగా చేసిన విజ్ఞప్తి అందుకు మరింత బలం చేకూరుస్తోంది. నేపాల్ లో భూకంపం సంభవించిన అనంతరం మొత్తంగా 34 దేశాలు రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాయి. అయితే ఎనిమిది రోజుల సహాయక చర్యల అనంతరం నేపాల్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నేపాల్ భూకంప సహాయక చర్యల్లో పాల్గొంటున్న భారత్ తో సహా 34 దేశాలను వెనక్కి వెళ్లిపోవాలంటూ నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. తమ ఆర్మీయే సహాయక చర్యల్లో పాల్గొంటుందని ఈ మేరకు సూచించింది. ఇక చేసిన సాయం చాలు.. ఆపండి అంటూ నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అక్కడ సహాయక చర్యల్లో ఉన్న పలు దేశాల తిరిగి వెనక్కి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.ఇదిలా ఉండగా  భారత్ ను వెనక్కి వెళ్లిపోవాలంటూ వచ్చిన వార్తలను ఢిల్లీలో ఉన్న నేపాల్ రాయబారి ఖండించారు. మిగతా దేశాల పని ముగియడంతో వాటిని మాత్రమే వెనక్కి పోవాలని నేపాల్ ప్రభుత్వం తెలిపిందని.. భారత్ మాత్రం యథావిధిగా సహాయక చర్యల్లో పాల్గొంటుదని తెలిపారు.


 


నేపాల్ లో సంభవించిన భూకంపంతో ఎవరెస్ట్ పర్వతం పై నుంచి భారీగా మంచు చరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పై సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతుంది.  భూకంపంతో  మృత్యువాత పడిన వారి సంఖ్య ఏడు వేలకు పైగా చేరగా, ఎవరెస్ట్ పర్వతారోహకులు 22 మంది గల్లంతయ్యారు.  అయితే ఎవరెస్ట్ పర్వతారోహకుడు అర్జున్ భాజ్ పాయ్ తో సహా 12 మందిని నేపాల్ ప్రభుత్వం రక్షించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top