పతికీ ప్రసవ వేదన..

పతికీ ప్రసవ వేదన.. - Sakshi


ఇక్కడ చూడండి.. పాపం.. భర్త బాధతో విలవిల్లాడుతుంటే.. అతడి భార్య చూడండి ఎలా పకపకా నవ్వుతోందో.. ఎందుకో తెలుసా? ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు మరీ! ఇక్కడ కనిపిస్తున్న ఆమె గర్భవతి. అయితే.. ప్రసవ వేదన పడుతున్నది మాత్రం ఆమె భర్తే! ఎందుకిదంతా అంటే.. అమ్మ కాబోతున్న అతివలు తమ భావోద్వేగాలను భర్తలు మరింత ఎక్కువగా అర్థం చేసుకోవాలని కోరుకుంటారని ఇటీవల ఓ అధ్యయనంలో తేలిందట. దీంతో చైనాలోని హాంగ్‌జౌలో ఉన్న ఎయిమా ప్రసూతి ఆస్పత్రివారు ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు.

 

 ‘పెయిన్ ఎక్స్‌పీరియన్స్ క్యాంప్’ను ఏర్పాటు చేశారు. ప్రసవం సమయంలో మహిళలు ఎంత నరకయాతన అనుభవిస్తారో.. ఆ అనుభూతిని భర్తలకూ కలగజేయడమే ఈ కేంద్రం లక్ష్యం. ఇందులో తమ పేర్లు రిజిస్టర్ చేసుకునే భర్తల ఉదర భాగంలో ప్రత్యేకమైన ప్యాడ్స్ తగిలించి.. ఎలక్ట్రిక్ షాకుల ద్వారా ప్రసవ సమయంలో కలిగే వేదనను వీరికీ కలగజేస్తారు. నొప్పి స్థాయిని బట్టి 1 నుంచి 10 గ్రేడ్‌లు ఉంటాయి. వారే ఉద్దేశంతో ఏర్పాటు చేసినా.. ఈ కేంద్రానికి తెగ డిమాండ్ వచ్చేసిందట. నవంబర్‌లో మొదలైన ఈ కేంద్రంలో ఇప్పటివరకూ 300 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top