మతం మాకు చాలా ముఖ్యం!

మతం మాకు చాలా ముఖ్యం!


► భారత్లో 80% మంది.. అమెరికాలో 50% మంది వెల్లడి

► మతానికి ప్రాధాన్యతనిచ్చే జనం ఇథియోపియాలో అత్యధికం

► చైనాలో అత్యల్పం.. 100 మందిలో ముగ్గురే మతవిశ్వాసులు

► 2050 నాటికి మారనున్న మత సమీకరణాలు: ప్యూ రీసెర్చ్ సర్వే




భారతదేశంలో 80 శాతం మంది ప్రజలు తమ జీవితంలో మతానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే.. ఇటువంటి వారు ఇథియోపియాలో అత్యధికంగా ఉంటే.. చైనాలో అతి తక్కువగా ఉన్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం వెల్లడిస్తోంది. 2015లో ప్రపంచ వైఖరుల సర్వేలో భాగంగా.. మతం విషయంలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయన్నదానిపై అధ్యయనం చేశారు. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా ప్రజల్లో ప్రతి 100 మందిలో 98 మంది మతం తమకు చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నట్లు తేలింది.



సర్వేలో ప్రశ్నించిన వారిలో దాదాపు అందరూ ఇథియోపియన్ ఆర్థొడాక్స్ చర్చ్ అనేది తమ జీవితంలో చాలా ముఖ్యమైన భాగమని బదులిచ్చారు. మరో ఆఫ్రికా దేశమైన సెనెగల్లో కూడా దాదాపు ఇదే రకమైన పరిస్థితి ఉంది. మెజారిటీ ముస్లిం మతస్తులైన అక్కడి ప్రజల్లో 97 శాతం మంది మతానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఇక పాకిస్తాన్, ఇండొనేసియా, బుర్కినా ఫాసో తదితర దేశాల్లో 90 శాతానికన్నా ఎక్కువ మంది తమ జీవితంలో మతం చాలా ముఖ్యమైన భాగమని స్పందించారు.



అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అధికం

అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలకన్నా.. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజలకు మతం చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. ఆర్థికంగా శక్తివంతమైన చాలా దేశాల్లో మతం ముఖ్యమైన అంశంగా పరిగణించే జనం 20 శాతం లేదా అంతకన్నా తక్కువగానే ఉన్నారు. ఉదాహరణకు బ్రిటన్, జర్మనీల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే తమ జీవితాల్లో మతాన్ని చాలా ముఖ్యమైన విషయంగా చెప్తున్నారు. రష్యా, ఆస్ట్రేలియాల్లో ఈ సంఖ్య ఇంకొంచెం తక్కువగా ఉంది. అయితే.. అగ్రరాజ్యం అమెరికాలో సగానికన్నా ఎక్కువ మంది మతాన్ని చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించడం విశేషం. ప్రపంచ దేశాలన్నిటిలోనూ మతాన్ని ముఖ్యమైన విషయంగా పరిగణించే వారి సంఖ్య చైనాలో అతి తక్కువగా ఉంది. అక్కడ ప్రతి 100 మందిలో ముగ్గురు మాత్రమే మతం చాలా ముఖ్యమైనదని చెప్పారు.



2050 నాటికి క్రైస్తవులతో సమానంగా ముస్లింలు...

ప్రపంచ జనావరణాలు, జనాభాలు మారుతున్న పరిస్థితుల్లో.. ప్రపంచంలో మత సమీకరణాలు 2050 నాటికి గణనీయంగా మారతాయని అధ్యయనకర్తలు చెప్తున్నారు. అప్పటికి ముస్లింల జనాభా క్రైస్తవుల జనాభాకు సమానంగా పెరుగుతుందని అంచనా. మరోవైపు.. ఏ మతాన్నీ ఆచరించని ప్రజల సంఖ్య పెరగడం నెమ్మదిస్తుందని.. ఫలితంగా ప్రపంచ జనాభాలో ఇటువంటి వారి శాతం మరింత తక్కువ అవుతుందని విశ్లేషిస్తున్నారు.



హిందువుల జనాభా 1970లో 46 కోట్లుగా ఉంటే.. 2010 నాటికి 103 కోట్లకు పెరిగింది. ఈ సంఖ్య 2050 నాటికి 138 కోట్లకు పెరుగుతుందని అంచనా.

►  క్రైస్తవుల సంఖ్య 1970లో 123 కోట్లుగా ఉండగా.. 2010 నాటికి 217 కోట్లకు పెరిగింది. ఈ జనాభా 2050 నాటికి 292 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు.

ముస్లింల జనాభా 1970లో 57 కోట్లుగా ఉండగా.. 2010 నాటికి 160 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య 2050 నాటికి 276 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

►  ఏ మతం ఆచరించని వారి సంఖ్య 1970లో 71 కోట్లు కాగా.. 2010 నాటికి 113 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య 2050 నాటికి 123 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు.

బౌద్ధ మతస్తుల సంఖ్య 1970లో 23 కోట్లు ఉంటే.. 2010 నాటికి 49 కోట్లకు పెరిగింది. 2050 నాటికి ఈ మతస్తుల సంఖ్య అంతే ఉంటుందని అంచనా.

(సాక్షి నాలెడ్జ్ సెంటర్)

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top