'అడుగు దూరంలో చావును చూశాను'

'అడుగు దూరంలో చావును చూశాను' - Sakshi


ఇస్తాంబుల్: అమెరికాకు చెందిన స్టీవెన్ నబీల్, నార్మిన్ నూతన దంపతులు. హనీమూన్ కోసం టర్కీకి వెళ్లారు. టర్కీలో వారం రోజులపాటు హనీమూన్ ను సరదాగా గడిపిన ఆ భార్యాభర్తలు తిరిగి న్యూయార్క్ కు వెళ్లడంలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఇస్తాంబుల్ లోని అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు, కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, మరో 230 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే. అయితే హనీమూన్తోనే తమ జీవితం ముగిసి పోయిందని తాము భావించామని ఈ నూతన దంపతులు చెప్పారు.



హనీమూన్ తోనే జీవితం ముగిసిందనుకున్నాను...

బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఓ  గన్ మెన్ ఆయుధంతో ఎయిర్ పోర్టు ఎంట్రీ పాయింట్ వద్దకు వచ్చాడు. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్న కొందరు ఆహారాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండగా, మరికొందరు ప్రయాణికులు అక్కడ కూర్చుని ఉన్నారు. ఇంతలో ఆ దుండగుడు ఏకే-47తో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో భార్యను కాపాడుకోవడానికి నానా తిప్పలు పడ్డానని నబీల్ చెప్పాడు. ఉగ్రవాది తనకు కేవలం అడుగు దూరంలో ఉన్నప్పుడు గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించిందన్నాడు. ఆ ఉగ్రవాది కాల్పులు జరపడంతో తమ జీవితం హనీమూన్ తోనే ముగిసి పోయిందని ఆందోళన చెందినట్లు వివరించాడు. అయితే అక్కడ ఉన్న ఓ బారీకేడ్ వెనుక దాక్కుని ప్రాణాలు నిలబెట్టుకున్నామని చెప్పాడు.



భార్య నార్మిన్ కు కాస్త గాయాలయ్యాయని, కానీ అరవడం లాంటివి మాత్రం చేయవద్దని సూచించినట్లు పేర్కొన్నాడు. దాదాపు 10-15 నిమిషాల పాటు కాల్పులు జరిపి అనంతరం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని, అక్కడ ఏం జరిగిందన్న దానిపై టర్కీ అధికారులకు ఇప్పటికీ స్పష్టత రాలేదని అభిప్రాయపడ్డాడు. ఈ దాడుల నుంచి బయటపడి, షాక్ నుంచి తేరుకున్న వెంటనే తమ కుటుంబసభ్యులు, బంధువులకు ఫోన్ చేసి తమ క్షేమ సమాచారం తెలిపినట్లు వివరించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరిపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటనను వివరించాడు.


 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top