ఇదే సరైన సమయం: డొనాల్ట్ ట్రంప్

ఇదే సరైన సమయం: డొనాల్ట్ ట్రంప్ - Sakshi


వాషింగ్టన్‌: మార్పు, కచ్చితమైన చర్యల కోసమే దేశ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఒబామా హెల్త్‌కేర్‌ తదితర పథకాల రద్దు విషయమై ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల అమలు వేగం పెంచడంపై తనను తాను ఆయన సమర్థించుకున్నారు. నేషనల్‌ రిపబ్లికన్‌ కాంగ్రెషనల్‌ కమిటీ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘చరిత్రాత్మక మార్పు కోసం గతేడాది నవంబర్‌ 8న అమెరికన్‌ ప్రజలు ఓటు వేశారు. కచ్చితమైన చర్యలను ఆశిస్తూ హౌజ్‌, సెనేట్‌, వైట్‌ హౌస్ లను అప్పగించారు. ప్రజలు మనకు స్పష్టమైన సూచనలు చేశారు. పని పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం’ అని పేర్కొన్నారు.



‘గురువారం నాటి కీలకమైన ఓటుతో చట్టబద్ధమైన ప్రయత్నం ప్రారంభమవుతుంది. విపత్తు వంటి ఒబామా కేర్‌ను రద్దు చేసి కొత్తదాన్ని ప్రవేశపెట్టడానికి రిపబ్లికన్‌ పార్టీకి, దేశ ప్రజలకు కూడా ఆ ఓటు కీలకమే’  అని ట్రంప్ తెలిపారు. దేశంలో నెలకొన్న నూతన వ్యాపార వాతావరణం వల్లే అమెరికా ఉద్యోగాలు వెనక్కి వస్తున్నాయని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. మరోవైపు విదేశీయులపై అమెరికన్లు జాతి విద్వేష దాడులకు పాల్పడుతున్నా ఏ చర్యలు తీసుకోకుండా, కేవలం అమెరికన్లకు ఉద్యోగాలు, వారి అభివృద్ధి మాత్రమే తనకు ముఖ్యమని పేర్కొంటూ ట్రంప్ తన శైలిలో పాలన కొనసాగిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top