వాహనాలతో చంపుతారా? ఉగ్రవాదులను ఆపేదెలా?

వాహనాలతో చంపుతారా? ఉగ్రవాదులను ఆపేదెలా?


లండన్‌‌: విశాల వీధులు, పాద చారులు నడిచి వెళ్లేందుకు పెద్ద పెద్ద ఫుట్‌పాత్‌లు.. ఇలాంటివన్నీ కూడా లండన్‌ సొంతం. అలాగే, ఇతర యూరప్‌ దేశాల్లో కూడా. ఇప్పుడు ఇలాంటి నగరాలనే ఉగ్రవాదులు ప్రధానంగా ఎంచుకుంటున్నారు. గతంలో మాదిరిగా తుపాకులు బాంబులకంటే వాహనాలే సాధారణ పౌరుల ప్రాణాలు చిదిమేసే మారణాయుధాలుగా ఉపయోగిస్తున్నారు. వీటితో అయితే, కదులుతున్న వ్యక్తి తప్పించుకునే అవకాశం ఉండదు, గురి తప్పదని వారి ఉద్దేశం.



పైగా ఇలాంటి దాడులను బలగాలు నియంత్రించడం అంత తేలికైన విషయం కాదు.. మరో వాహనంతో ఆ వాహనాన్ని ఢీకొట్టించడమో లేక, ఆ వాహనం నడుపుతున్న వ్యక్తిని అంతమొందించడమో చేస్తే తప్ప ఆ ఉగ్రవాది రాసే మరణకాండ ఆగదు. ఈ కారణంగానే ఇటీవల ఉగ్రవాదులు వాహనాల ద్వారా ప్రాణాలు తీసే వ్యూహాలు రచిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ‘ఇలాంటి దాడికి ముందస్తుగా ఎలాంటి ప్రత్యేక సన్నద్దత అవసరం లేదు. పైగా దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.



పైగా లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తిని వాహనాలతో అయితే వారు చంపేసే అవకాశం ఉంది’ అని ఉగ్రవాద అంశం నిపుణుడు సెబాస్టియన్‌ పీట్రాసాంత చెప్పారు. ఇలాంటి దాడులు సాధారణంగా ఒక్కరే చేస్తారని, అప్పటికప్పుడు వారి ప్రణాళికలు మార్చుకుంటూ దాడికి దిగుతారని అంటున్నారు. వాహనాలతో దాడికి దిగడం లండన్‌లో మాత్రమే ప్రథమం కాదు. ఇవి 2005లోనే మొదలైనప్పటికీ తాజాగా ప్యారిస్‌ దాడితో మరింత వెలుగులోకి వచ్చింది. ఓ భారీ ట్రక్‌తో వచ్చిన ఉగ్రవాది జనాలపైకి ఇష్టానుసారం దూసుకెళ్లి 86మందిని హతమార్చాడు. బాస్టిల్‌ డే సందర్భంగా నైస్‌ ప్రాంతలో ఈ దారుణం జరిగింది.



నైస్‌లో జరిగిన దాడికి తానే కారణం అని ఐసిస్‌ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. బెర్లిన్‌లో కూడా ఇదే తరహా దాడి చోటు చేసుకుని 12మంది ప్రాణాలుకోల్పోయారు. అలాగే, 2008లో సరిగ్గా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పర్యటనకు ముందు జెరూసలెంలో ఓ పాలస్తీనియన్‌ ఒక పెద్ద బుల్డోజర్‌ వేసుకొని వాహనాలపైకి దూసుకెళ్లగా ఆ సమయంలో 16మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలా ఉగ్రవాదులు దాడులకు కొత్త పంథాను అనుసరిస్తూ హడలెత్తిస్తున్నారు.



సాధారణంగా మారణాయుధాలతో వచ్చే ఉగ్రవాదులనైతే గుర్తించే అవకాశం ఉందికానీ, స్వదేశంలో సామాన్య పౌరుడిగా ఉంటూ ఉగ్రవాద భావజాలం ప్రేరేపితుడై వాహనాల్లో వస్తూ దాడి చేసేవాళ్లను గుర్తించడం పోలీసులకు, బలగాలకు పెద్ద సవాలే అని పలువురు నిపుణులు వాపోతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top