స్త్రీ, పురుష వేతనాల్లో ఇంత వ్యత్యాసమా?

స్త్రీ, పురుష వేతనాల్లో ఇంత వ్యత్యాసమా? - Sakshi


లండన్: ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం అలాగే కొనసాగుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వేతన వ్యత్యాసం ఎక్కువగా ఉండడం ఆశ్చర్యకరం. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం బ్రిటన్‌లో స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం 66 శాతం ఉండగా, చైనాలో 65 శాతం, అమెరికాలో 64 శాతం, కెనడాలో 62 శాతం, ఫ్రాన్స్‌లో 50 శాతం కొనసాగుతోంది.



అభివృద్ధి చెందిన దేశాల్లో స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం బ్రిటన్‌లోనే ఎక్కువగా ఉంది. అక్కడ ఒకే ఉద్యోగానికి పురుషులకు చెల్లిస్తున్న వేతనాల్లో మూడో వంతు మాత్రమే స్త్రీలకు చెల్లిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో బ్రిటన్ ప్రభుత్వం 250 మందికన్నా మించి ఉద్యోగులున్న కంపెనీలు తప్పనిసరిగా స్త్రీలకు చెల్లిస్తున్న వేతనాలు, బోనస్ ఎంతో, అలాగే పురుషులకు చెల్లిస్తున్న వేతనాలు, బోనస్ ఎంతో వివరాలను ప్రకటించాలంటూ కొత్త నిబంధనలను జారీ చేసింది. అలాగే ఏ ర్యాంకులో ఎంతు మంది పురుషులు, ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేయాలని కూడా పేర్కొంది. ఈ నిబంధనను 2018 సంవత్సరం నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది.



 స్త్రీ, పురుషుల వేతనాల వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు ఎంతగానో తోడ్పడతాయని లింగ వివక్షతకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో పోరాటం చేస్తున్న ఫాసెట్ సొసైటీ వ్యాఖ్యానించింది. అయితే వ్యత్యాస నిర్మూలనకు ఈ నిబంధనలు దోహదపడవని, వ్యత్యాసం చూపిస్తున్న కంపెనీలకు జరిమానాలు విధిస్తేనే వ్యత్యాసాన్ని నిర్మూలించవచ్చని అభిప్రాయపడింది. అమెరికా కూడా ఇలాంటి నిబంధనలను తీసుకరావాలని యోచిస్తోంది. వంద మందికన్నా ఎక్కువ ఉద్యోగులను కలిగివున్న కంపెనీలు జాతి, మత, లింగపరంగా చెల్లిస్తున్న వేతనాలను వెల్లడించాలని దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవలనే ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top