యంగ్ ఏజ్లో ఓల్డ్ ఏజ్ చూడొచ్చు

యంగ్ ఏజ్లో ఓల్డ్ ఏజ్ చూడొచ్చు - Sakshi


మిచిగాన్: వృద్ధాప్య సమస్యలు మనకు తెలియనివికావు. వయసు మీద పడుతున్నాకొద్దీ కాళ్లు పీకుతుంటాయి. చేతులు లాగుతుంటాయి. మొకాళ్లు సలుపుతుంటాయి. నడుము వొంగదు. మెడ కదలదు. నాలుక తిరగదు. కాళ్లు ముందుకు పడవు. కాసేపు నడిస్తేనే అలసట. చేతులు సరిగ్గా ఆడవు. ముంచేతులు లాగుతుంటాయి. చూపు సరిగ్గా ఆనదు. గుడ్లు పీకుతుంటాయి. చెవులు సరిగ్గా వినిపించవు. బుర్ర సరిగ్గా పనిచేయదు. చుట్టుపక్కల గోలగోల ధ్వనులు. మొత్తంగా పరిస్థితి గందరగోళంగాను, బిత్తరబిత్తరగాను ఉంటుంది.



యుక్త వయస్సులోనే ఇలాంటి పూర్తి అనుభూతులను మనకు కలిగించే ఓ సూట్ను ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ రూపొందించింది. కళ్లు గ్లూకోమా వచ్చినట్టు మసమసకగా కనిపించేందుకు గాగుల్స్‌ను, చెవులు సరిగ్గా వినిపించకుండా ఉండేందుకు హెడ్‌ఫోన్స్‌ను, మెడ సరిగ్గా తిరగకుండా ఉండేందుకు నెక్ బ్యాండ్‌ను, స్టిమ్యులేట్ చేయడానికి గ్లోవ్స్‌ను, కాళ్ల పిక్కలను పట్టి ఉంచేందుకు పట్టీలను రూపొందించి, వీటన్నింటితో కలిపి ఓ సూట్‌గా తయారు చేసింది. ఈ సూటను ఎవరు ధరించినా వందేళ్లకు పైబడిన వృద్ధుడిగా అనుభూతి పొందక తప్పదు. 36 ఏళ్ల రిచర్డ్ గ్రే అనే ఓ మిడియా రిపోర్టర్‌కు ఈ సూట్‌ను తొడిగి ఫోర్డ్ కంపెనీ ప్రయోగాత్మక పరీక్షలను నిర్వహించింది.



ఈ సూటును ధరించి రిపోర్టర్ ఓ పబ్లిక్ పార్కులో ప్రయాసపడి పరుగెత్తాడు. పైన ఉదహరించిన అనుభూతులన్నీ ఆయన అనుభవించినవే. రోజూ సునాయాసంగా పరుగెత్తే తాను ఆ సూటు ధరించాక రెండు కిలోమీటరు పరుగెత్తడం కూడా గగనమైందని, సూటు విప్పివేయగానే మళ్లీ 36 ఏళ్ల ప్రాయంలోకి వచ్చేశానని ఆయన తన అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. ‘థర్డ్ ఏజ్ సూట్’ పేరు పెట్టిన ఈ సూటును కంపెనీ ఉత్పత్తుల ప్రచారకర్తగా పనిచేస్తున్న  ప్రపంచ ప్రసిద్ధి చెందిన 104 ఏళ్ల బ్రిటీష్ మారథాన్ రన్నర్ సిక్ ఫౌజా సింగ్‌ను మోడల్‌గా తీసుకొని రూపొందించారు.



పడుచువాళ్లకు వృద్ధాప్య సమస్యలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఈ సూటును తయారు చేయలేదు. నిజంగా వృద్ధుల సమస్యలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అర్థం చేసుకొని వారికి అనుగుణంగా కార్లను, వాటిలోని డ్రైవింగ్ వ్యవస్థను రూపొందించడం కోసమే ‘ఫోర్డ్’ కంపెనీ ఈ సూటును రూపొందించింది. ఈ ప్రయోగం ద్వారానే వృద్ధులు ఇగ్నిషన్ కీ ద్వారా కార్టును స్టార్ట్ చేయలేరని భావించి, దాని స్థానంలో బటన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. అలాగే కారు డోర్లు వేయడం, తీయడాన్ని మరింత సులువు చేసింది. వృద్ధులు సులభంగా కార్లను పార్కు చేసేందుకు కూడా అవసరమైన మార్పులు తీసుకొస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top