అంతరిక్షంలోకి ‘ఫేస్‌బుక్’

అంతరిక్షంలోకి ‘ఫేస్‌బుక్’ - Sakshi


న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇంటెర్నెట్ సర్వీసులను విస్తరించడం కోసం ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’ అంతరిక్షంలోకి ఓ ప్రత్యేక జియోసెంట్రిక్ శాటిలైట్‌ను ప్రయోగిస్తోంది. అందుకోసం స్పేస్‌కామ్, యూటెల్‌శాట్ సంస్థలతో కలసి ‘ఆమోస్-6’ అనే శాటిలైట్‌ను అభివృద్ధి చేస్తున్నామని, దాన్ని 2016, ద్వితీయార్ధంలో ప్రయోగిస్తామని ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా తన ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించారు. (ఫేస్‌బుక్‌లో ఆయనకు 3,91,24,761 మంది ఫాలోవర్స్ ఉన్నారు)

 


ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ స్కీమ్ కింద ఈ శాటిలైట్‌ను రూపొందిస్తున్నామని, దీన్ని ప్రయోగించడం వల్ల దక్షిణాఫ్రికాలోని మారుమూల ప్రాంతాలకు కూడా రోదసి నుంచి ఇంటర్నెట్ సర్వీసులు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా ఇంటర్నెట్ సర్వీసులను అందించడం తమ లక్ష్యం కాదని, సాధ్యమైనంత తక్కువ ఖర్చులో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తేవడం, అవసరమైతే ఇతర గ్రహాలకు కూడా ఇంటర్నెట్ తరంగాలను పంపించడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు.


ప్రపంచంలో మూడొంతుల జనాభాకు మొబైల్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో 2013లో నోకియా, శామ్‌సంగ్, ఎరిక్‌సన్‌తోపాటు చిప్ డిజైనర్ క్వాల్‌కామ్‌తో కలసి ఫేస్‌బుక్ ‘ఇంటర్నెట్ డాట్ ఆర్గ్’ను ఏర్పాటు చేసింది.  ఈ కంపెనీ లక్ష్య సాధనలో భాగంగానే ఆకాశంలోకి డ్రోన్‌లను పంపించి వాటి ద్వారా నెట్ సిగ్నల్స్ పంపించే ప్రక్రియపై పలు ప్రయోగాలు నిర్వహించింది. ఆ ప్రయోగాల విస్తరణలో భాగంగానే ఇప్పుడు అంతరిక్షంలోకి శాటిలైట్‌ను పంపించాలని సంకల్పించింది.


Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top