ఒలింపిక్స్‌కు ఎంత ఖర్చయింది?

ఒలింపిక్స్‌కు ఎంత ఖర్చయింది?


ప్రపంచ క్రీడాకారుల్లో కొందరికి మధుర జ్ఞాపకాలను, కొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చి రియో ఒలింపిక్స్ చరిత్ర పుటల్లోకి జారుకుంది. ఇలాంటి ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఏ దేశానికైనా ఎంత ఖర్చవుతుంది? ఇప్పటివరకు ఏయే ఒలింపిక్స్‌కు ఎంత ఖర్చయిందన్నది ఆసక్తికరమైన అంశం. నాలుగేళ్లకోసారి నిర్వహించే సమ్మర్ ఒలింపిక్స్‌కు సరాసరి సగటున 520 కోట్ల డాలర్లు (2015 సంవత్సరం నాటి అమెరికా కరెన్సీ లెక్కల ప్రకారం), అంటే భారత కరెన్సీలో దాదాపు 34,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, అదే వింటర్ ఒలింపిక్స్‌కు 310 కోట్ల డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో 20,806 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, దానికి అనుబంధంగా పనిచేస్తున్న బిజినెస్ స్కూల్ విభాగానికి చెందిన ఆర్థిక నిపుణులు  లెక్కలు వేశారు. స్టేడియాల నిర్మాణం, క్రీడాకారులకు వసతి, రవాణా సౌకర్యాలు కాకుండా కేవలం క్రీడల నిర్వహణకే ఇంత ఖర్చవుతుందని వారు తేల్చారు.



ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించిన గణాంకాలు 1964 నుంచే అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు ఈ క్రీడల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో గణాంకాలు అందుబాటులో లేవు. గతంలో ప్రతి ఒలింపిక్స్‌కు అంచనాలకు మించి వంద శాతానికన్నా ఎక్కువగా ఖర్చు అవుతుండగా, గతానుభవాల రీత్యా రియో ఒలింపిక్స్ ఖర్చు అంచనాలకన్నా 50 శాతం మాత్రమే ఎక్కువ ఖర్చయింది. ఏదేమైనా ఖర్చు మాత్రం ఒక ఒలింపిక్స్ నుంచి మరో ఒలింపిక్స్‌కు పెరుగుతూనే ఉంది. 2012 లండన్‌లో జరిగిన ఒలింపిక్స్ అత్యంత ఖరీదైనవిగా చరిత్ర సృష్టించింది. ఆ ఒలింపిక్స్‌కు 1500 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. 970 కోట్ల డాలర్ల ఖర్చుతో బార్సిలోనా ఒలింపిక్స్ రెండో స్థానాన్ని ఆక్రమించింది.



1964లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌కు 28.20 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చయ్యాయి. అదే సంవత్సరం జరిగిన ఇన్స్‌బర్క్ వింటర్ ఒలింపిక్స్‌కు 2.20 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చయ్యాయి. లండన్‌లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌కు బడ్జెట్ అంచనాలకు మించి 76 శాతం ఎక్కువ నిధులు ఖర్చు కాగా, సోచిలో 2014లో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌కు బడ్జెట్ అంచనాలకు మించి 289 శాతం ఎక్కువ నిధులు ఖర్చయ్యాయి. అత్యధికంగా ఖర్చయిన వింటర్ ఒలింపిక్స్‌గా అది రికార్డులకు ఎక్కింది.  ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్ నిర్వహణకు 460 కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని తొలుత అంచనా వేశారు. కానీ దానికన్నా 51 శాతం ఎక్కువ నిధులు ఖర్చయ్యాయి. ఒలింపిక్స్ క్రీడల 'నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్' కింద గత ఒలింపిక్స్‌కు జరిగిన ఖర్చులను పంచుకోవడం ద్వారా అంచనాలకు, వాస్తవ ఖర్చులకు భారీ వ్యత్యాసం కాస్త తగ్గింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top