భారతీయ ఔషధ ప్రయోగాలపై యూరప్ అసంతృప్తి

భారతీయ ఔషధ ప్రయోగాలపై యూరప్ అసంతృప్తి - Sakshi


భారతదేశానికి చెందిన ఒక పరిశోధనా సంస్థ చేసిన పరీక్షలు అంత నమ్మశక్యంగా లేవని యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థ తేల్చేసింది. ఈ సంస్థ పరిశీలించిన దాదాపు 300 జెనెరిక్ డ్రగ్ అనుమతులు, డ్రగ్ అప్లికేషన్లను సస్పెండ్ చేయాలని సూచించింది. భారతదేశానికి చెందిన మైక్రో థెరప్యుటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ సంస్థకు ఇది అపప్రథగా నిలిచింది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ఈ విషయాన్ని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇటీవలి కాలంలో తరచు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్న భారత ఔషధ పరీక్షల పరిశ్రమకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు.



2016 ఫిబ్రవరి నెలలో ఇదే సంస్థ (మైక్రో థెరప్యుటిక్ రీసెర్చ్ ల్యాబ్స్) గురించి ఆస్ట్రియా, డచ్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో అసలు వీళ్లు అనుసరిస్తున్న ఔషధ ప్రయోగాల పద్ధతులు ఎంతవరకు సరిగ్గా ఉన్నాయనే అంశంపై యూరోపియన్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. పరిశోధన ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని సరిగా అన్వయించకపోవడం, డాక్యుమెంటేషన్ మరియు సమాచార విషయాల్లో లోపాలను ఇప్పటికే గుర్తించినట్లు ఈఎంఏ తెలిపింది. అయితే ఈ మందుల వల్ల ఏవైనా దుష్ప్రభావాలు వచ్చినట్లు గానీ, అవి పనిచేయకపోవడం గురించి గానీ ఇంతవరకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. మైక్రో థెరప్యుటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ సంస్థ పరిశీలించిన ఔషధాల మీద సస్పెన్షన్ అంశాన్ని యూరోపియన్ కమిషన్‌కు పంపుతారు. అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారు. భారతదేశానికి చెందిన పలు కాంట్రాక్టు పరిశోధన సంస్థలలో (సీఆర్ఓ) ఔషధ ప్రయోగాలు, పరీక్షలు నిర్వహిస్తారు. జెనెరిక్ ఔషధాల అనుమతులకు సంబంధించి ఈ పరీక్షలు చేయడం తప్పనిసరి. దేశంలోనే అతిపెద్ద సీఆర్ఓ అయిన జీవీకే బయో సైన్సెస్ చేసిన దాదాపు 700 మందులకు సంబంధించిన ఔషధ ప్రయోగాలను 2015లో నిషేధించింది. మిగిలిన చిన్న చిన్న భారతీయ సీఆర్ఓలు కూడా తగిన ప్రమాణాలు పాటించడంలో కొంతవరకు వెనకబడే ఉన్నాయని యూరోపియన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top