దోస్తీ కుదిరింది..

దోస్తీ కుదిరింది.. - Sakshi


దౌత్య సంబంధాలు, దీర్ఘకాలిక మైత్రీ బంధం, ఇతర దేశాధినేతలతో మాట్లాడుతున్నపుడు పాటించాల్సిన మర్యాద... ఇవేవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పట్టవు. మాకేంటి? అనే ఫక్తు వ్యాపార ధోరణి కనిపిస్తుంది. అమెరికాలో ఉద్యోగ కల్పన జరగాలని గట్టిగా కోరుకునే ట్రంప్‌కు, ‘మేకిన్‌ ఇండియా’ మంత్రం పఠించే భారత ప్రధాని నరేంద్ర మోదీల తొలిభేటీపై ఒకే ఉత్కంఠ. వీరిద్దరికీ ఏమేరకు లంకె కుదురుతుందనేదే  ప్రశ్న. సోమవారం భేటీ సందర్భంగా మోదీకి ట్రంప్‌ ఇచ్చిన ప్రాధాన్యత, ఇద్దరి మధ్య ఆలింగనాలు, పరస్పర పొగడ్తలు చూశాక ఇద్దరికీ స్నేహం బాగానే కుదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాతో భారత్‌ బంధం ఇదివరకట్లాగే కొనసాగుతుందనే నమ్మకం కలుగుతోంది.

 


2014లో ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మోదీకి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ బామాతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అమెరికా– భారత్‌ సంబంధాలు బాగా బలపడ్డాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలవడంతో అనిశ్చితి. భారత ఐటీ పరిశ్రమకు ఆయువుపట్టు లాంటి హెచ్‌1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం, కాల్‌ సెంటర్ల ఔట్‌సోర్సింగ్‌పై ఆంక్షలు పెట్టడం... తదితర ట్రంప్‌ చర్యలు భారత ప్రయోజనాలను భంగకరం. ఇలాంటి వివాదాస్పద అంశాలకు భారత్‌ తన అజెండాలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగానే అజెండా రూపొందించారు. మోదీ కూడా ఈసారి అమెరికా పర్యటనలో భారీ కార్యక్రమాల జోలికి వెళ్లకుండా... లో ప్రొఫైల్‌లో ఉన్నారు. ట్రంప్‌ది దుందుడుకు స్వభావం. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌ శరణార్థులను అమెరికా తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పడంతో ట్రంప్‌ అర్థంతరంగా ఫోన్‌ పెట్టేశారు. అలాగే జర్మనీ ఛాన్స్‌లర్‌ మెర్కెల్‌తో కరచాలనం చేయడానికి మీడియా కెమేరాల సాక్షిగా నిరాకరించారు.


కాబట్టి భారత అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిభేటీలో పరిచయం చేసుకోవడం, పరస్పరం భావాలను పంచుకోవడం, మైత్రి చిగురించడం, ఒకరిపై మరొకరికి సదభిప్రాయం ఏర్పడటం ముఖ్యమని భావించారు. భేటీపై భారీ అంచనాలు లేకుండా చూశారు. దేశాధినేతలు బాగా కలిసిపోతే... మిగతావన్నీ చక్కబడతాయి’ అని భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌ వ్యాఖ్యానించారు. సోమవారం భేటీ ఆద్యంతం ఇరువురి ముఖాలపై చిరునవ్వు, మూడుసార్లు ఆలింగనాలు, మోదీకి ట్రంప్‌ స్వయంగా వైట్‌హౌస్‌ను చూపించడం... కెమిస్ట్రీ బాగా కుదిరిందడానికి నిదర్శనాలుగా పేర్కొంటున్నారు.


పరస్పరం పొగడ్తలు...

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ నాయకుడికి స్వాగతం పలకడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్‌ అన్నారు. భారత్‌ ప్రపంచంలోనే అధిక వృద్ది రేటును కలిగిన దేశమని, తాము కూడా ఆ స్థాయి వృద్దిరేటును సాధించే దిశగా ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే భారత్‌ను అందుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జీఎస్‌టీ లాంటి అతిపెద్ద సంస్కరణ తెచ్చారని, ప్రధానిగా మోదీ అద్భుత పనితీరును కనబరుస్తున్నారని ప్రశంసించారు. నన్ను గెలిపిస్తే వైట్‌హౌస్‌లో నిజమైన మిత్రుడు ఉంటాడని ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఇప్పుడదే జరిగింది... శ్వేతసౌధంలో మీకు నిజమైన మిత్రుడున్నాడు... అని ట్రంప్‌ పేర్కొన్నారు.


వ్యాపార రంగంలో మీకున్న అపార అనుభవం ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని మోదీ అమెరికా అధ్యక్షుడిని పొగిడారు. మీ నాయకత్వంలో ఇరుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని నేను విశ్వసిస్తున్నాను... అని మోదీ అన్నారు. మోదీకి స్వాగతం నుంచి వీడ్కోలు పలకడం దాకా... సృహుద్భావపూరిత వాతావరణం వెల్లివిరిసింది.


ట్రంప్‌ అవే లెక్కలు..

భారత్‌ను కీలకమైన భాగస్వామిగా పేర్కొంటూనే... ట్రంప్‌ తనదైన శైలిలో అమెరికాకు మరిన్ని ప్రయోజనాలు ఉండాలని ఆశించారు. భారత్‌తో అమెరికాకు 31 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు ఉందనే విషయాన్ని ఎత్తిచూపుతూ... దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో మరింత మార్కెట్‌ కల్పించాలని, నిబంధనలను సడలించాలని కోరారు. వ్యాపారవేత్తగా తన విజయాలను గొప్పగా చెప్పుకోవడం ట్రంప్‌కు అలవాటు. అదే ధోరణిలో సోషల్‌ మీడియాలో మోదీ నేను వరల్డ్‌ లీడర్స్‌ అని గర్వంగా ప్రకటిస్తున్నానన్నారు. ట్వీటర్‌లో ప్రపంచంలో అత్యధికంగా ట్రంప్‌కు 3.28 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, 3.1 కోట్లతో మోదీ తర్వాతి స్థానంలో ఉన్నారు.


అమెరికాలో ఉద్యోగాల కల్పనకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పుకోవడానికోసం... స్పైస్‌జెట్‌ సంస్థ 100 బోయింగ్‌ విమానాలను ఆర్డర్‌ చేసిందని... వారికి కృతజ్ఞతలు తెలిపారు. దీని మూలంగా అమెరికా వేలకొద్ది ఉద్యోగాలు కొత్తగా వస్తాయన్నారు. అమెరికా నుంచి 22 గార్డియన్‌ డ్రోన్‌ల కొనుగోలుకు ముందుకు వచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా నుంచి భారత్‌ సహజ వాయువు కొనుగోలుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని, కొంచెం ఎక్కువ ధరను కోరుకుంటున్నామని... మొత్తానికి ఒప్పందం కుదురుతుందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. భారత్‌ ఆయుధ కొనుగోళ్లను దృష్టిలో పెట్టుకొని రక్షణ రంగంలో మరింత సహకారానికి సిద్ధంగా ఉన్నామన్నారు.


సంయుక్త ప్రకటనలో హెచ్‌1బీ వీసా, వాతావరణ మార్పులు తదితర వివాదాస్పద ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అసలు హెచ్‌1బీ అంశం ప్రస్తావనకు  రాలేదని వార్తలు వస్తున్నాయి. ఇది భారత ఐటీ కంపెనీలతో పాటు తెలుగురాష్ట్రాలకు చెందిన ఐటీ నిపుణులకు తీవ్ర నిరాశ కలిగించే అంశం. భారత్‌తో ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాల్లో అమెరికాకు మరిన్ని ప్రయోజనాలు ట్రంప్‌ ఆశిస్తున్నారనేది సుస్పష్టం.


భారత్‌కు ఏంటి?

ఈ భేటి ద్వారా భారత్‌కు ఒనగూరిన ప్రయోజనం ఏమిటంటే... ఉగ్రవాదానికి ఊతమిచ్చే విషయంలో పాక్‌ పట్ల అమెరికా మరింత కఠిన వైఖరిని తీసుకోవడం. నిజానికి ట్రంప్‌ గెలిచినప్పటి నుంచే పాక్‌ చిత్తశుద్ధిపై అనుమానంతోనే ఉన్నారు. పాక్‌కు వార్షిక సహాయాన్ని 1645 కోట్ల నుంచి 645 కోట్లకు తగ్గించడమే కాకుండా దీన్ని సహాయంగా కాకుండా రుణంగా మార్చారు. అలాగే పాకిస్తాన్‌కు నాటోయేతర ప్రధాన భాగస్వామి హోదా ఉంది. ఈ హోదాను ఉపసంహరించాలని ఇటీవలే అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు సభ్యులు ఒక బిల్లు పెట్టారు. సోమవారం ట్రంప్‌తో మోదీ భేటీ కావడానికి కొద్దిగంటల ముందు... తీవ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థ చీఫ్‌ సయ్యల్‌ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. సీమాంతర ఉగ్రవాద దాడులకు పాక్‌ భూభాగాన్ని వాడుకోకుండా చూడాల్సిన బాధ్యత ఆ దేశంపై ఉందని అమెరికా, భారత్‌లు సంయుక్త ప్రకటనలో కోరాయి.


తీవ్రవాదాన్ని సమూలంగా రూపుమాపడానికి, వారి సురక్షిత స్థావరాలను తుడిచిపెట్టడానికి కలిసి పనిచేస్తామని ట్రంప్‌ అన్నారు. తీవ్రవాదంపై పోరు తమ తొలి ప్రాధాన్యమని ఇరువురు నేతల పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో సుస్థిరతకు పాక్‌ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఆ దేశంతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. అయితే తాజా ప్రకటన పాక్‌ పట్ల అమెరికా మరింత కఠిన వైఖరి తీసుకుంటోందనే దానికి సంకేతంగా భావిస్తున్నారు. పాక్‌– చైనాతో చెట్టాపట్టాలేసుకోవడం, ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరం. ఈ రెండు అంశాలు కూడా పాక్‌ పట్ల అమెరికా వైఖరి మారడానికి కారణాలే.– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top