ఇన్సులిన్ ఇంజెక్షన్ కు బదులుగా పిల్స్..!

ఇన్సులిన్ ఇంజెక్షన్ కు బదులుగా పిల్స్..! - Sakshi


మధుమేహాన్ని తగ్గించే రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లకు బదులుగా  పిల్ ను అభివృద్ధి చేశారు న్యూయార్క్ శాస్త్రవేత్తలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కొత్తరకం ఇన్సులిన్ పిల్ ను తయారు చేసినట్లు నయాగరా యూనివర్శిటీ ప్రొఫెసర్ మేరే మెక్ కోర్ట్ పరిశోధక బృందం వెల్లడించింది. తమ పరిశోధనలను ఇప్పటికే ఎలుకలపై పరీక్షించి విజయవంతమైన అధ్యయనకారులు మరిన్ని జంతు పరీక్షల అనంతరం అందుబాటులోకి తెస్తామంటున్నారు.



మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని.. డయాబెటిస్ అనికూడా వ్యవహరిస్తారు. ఈ వ్యాధి శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడంవల్ల రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో  ఓ రుగ్మతగా మారుతుంది. అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం, చూపు మందగించడం, ఉన్నట్లుండి బరువు తగ్గిపోవడం, బద్ధకంగా ఉండటంవంటి లక్షణాలు ఈ వ్యాధిగ్రస్థుల్లో కనిపిస్తాయి. రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిని బట్టి ఈ వ్యాధిని గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాల ప్రకారం భారత్, చైనాలతోపాటు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ వ్యాధి అత్యధికంగా ఉంది. 2014 గణాంకాల ప్రకారం  ప్రపంచవ్యాప్తంగా సుమారు 422 మిలియన్ల ప్రజలు డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతుంటే మరికొందరు ఇన్సులిన్ ఇంజెక్షన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన  టైప్-2 డయాబెటిస్ కలిగి ఉన్నారు. అయితే ఇలా ఇంజెక్షన్ తరచుగా తీసుకోవడం వల్ల వచ్చే నొప్పినుంచీ బాధితులకు కొంత ఉపశమనం ఇచ్చే విధంగా  పరిశోధకులు 'ఇన్సులిన్ పిల్' ను కనుగొన్నారు. ఈ 'పిల్స్' రక్తంలో కరిగి పోయేందుకు వీలుగా  ఫ్యాట్ కోటింగ్ తో తయారు చేస్తున్నారు.



నోటిద్వారా వేసుకునేందుకు వీలుగా తయారైన ఇన్సులిన్  పిల్స్.. ఇన్పులిన్ సరఫరా చేసే చిన్న వెసిల్స్ ఉపయోగించి నూతన మార్గంలో అభివృద్ధి చేస్తున్నట్లు న్యూయార్క్ నయాగరా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మేరీ మెక్ కోర్ట్ తెలిపారు. కొలెస్టోసమ్ అనే కొత్త సాంకేతికతను వినియోగించి ఈ పిల్స్ తయారు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మెక్ కోర్ట్ టీమ్ కొత్త పద్ధతిలో అభివృద్ధి పరచిన ఈ ఇన్సులిన్ పిల్ కు ల్యాబ్ లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. ఇన్సులిన్ లోడ్ చేసిన కొలెస్టోసమ్స్ ను ముందుగా ఎలుకలపై ప్రయోగించిన పరిశోధకులు... మరిన్ని జంతు పరీక్షలు నిర్వహించిన అనంతరం మనుషులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రస్తుతం  తమ పరిశోధనా ఫలితాలను ఫిలడెల్ఫియా అమెరికన్ కెమికల్ సొసైటీ జాతీయ సమావేశంలో ప్రదర్శించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top