కరెన్సీ నోట్లకు కాలం చెల్లు!

కరెన్సీ నోట్లకు కాలం చెల్లు! - Sakshi


ప్రపంచంలో వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పుల వల్ల రానున్న పదేళ్లలో కరెన్సీ నోట్లకు పూర్తిగా కాలం చెల్లిపోతుందని, వాటి స్థానంలో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, క్రెడిట్ కార్డు లావాదేవీలు కొనసాగుతాయని ఓ అధ్యయనంలో వెల్లడైనట్లు 'ఇంటెర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బిజినెస్' తెలిపింది. ఎలక్ట్రానిక్ లావాదేవీల నిర్వహణలో ప్రపంచంలోనే ముందున్న ఆస్ట్రేలియా ప్రతినెలా ఏటీఎంల నుంచి దాదాపు 66 లక్షల కోట్ల రూపాయల కరెన్సీని తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో 82 శాతం లావాదీవీలు కరెన్సీనోట్లు లేకుండానే కొనసాగుతున్నాయి. డెన్మార్క్ కూడా ఆస్ట్రేలియా బాటలో ముందడుగు వేస్తోంది. ఇక తాము కరెన్సీ నోట్లను ఏ మాత్రం ముద్రించాల్సిన అవసరం లేదని, కరెన్సీ రహిత సమాజాన్ని త్వరలోనే సృష్టించబోతున్నామని డెన్మార్క్ ఇటీవలే ప్రకటించింది. తమ దేశంలో వృద్ధులు తప్ప మిగతా వారంతా ఎలక్ట్రానిక్ లావాదేవీలనే ఆశ్రయిస్తున్నారని ఆస్ట్రేలియా మింట్ పేమెంట్స్ ఇంచార్జి జార్న్ బెహరెంట్ తెలిపారు. ఈ వృద్ధ తరానికి ఇంకా కరేన్సీ నోట్లపై మమకారం చావడం లేదని, ఈ తరం అంతరించాక తమ దేశంలో కరెన్సీ నోట్లను కావాలనేవారే ఉండరని ఆయన చెబుతున్నారు.



స్మార్ట్‌ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడంలో గతంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఇప్పుడు పటిష్ఠమైన సెక్యూరిటీ ఫీచర్స్ ఉండటంతో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన చెప్పారు. పైగా ఆపిల్ వాచ్ లాంటి పరికరాల ద్వారా కూడా సులభంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వెసులుబాటు అందుబాటులోకి వచ్చిందని ఆయన చెప్పారు. తమ దేశంలోని 2.30 కోట్ల మందికి ఐదుకోట్ల క్రెడిట్, డెబిట్ కార్డులున్నాయని ఆయన తెలిపారు.



నెలవారీ ఖర్చులకు బడ్జెట్‌ను రూపొందించుకోవడానికి యాప్స్ కూడా అందుబాటులోకి రావడంతో అమెరికా ప్రజలు కూడా ఎక్కువగా కరెన్సీ రహిత చెల్లింపులనే ఆశ్రయిస్తున్నారని అధ్యయనం తెలియజేసింది. అగ్రదేశాల బాటలోనే వర్ధమాన దేశాలు కూడా ఎలక్ట్రానిక్ చెల్లింపులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కరెన్సీ ముద్రణకు ఖర్చు పెరగడ,ం నకిలీ కరెన్సీ బెడత తీవ్రమవడంతో పలు దేశాలు కరెన్సీ రహిత చెల్లింపులను తప్పనిసరి చేస్తూ విధాన నిర్ణయాలకు కసరత్తు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పది, పన్నెండేళ్ల తర్వాత ప్రజలు కరెన్సీ నోట్లను మ్యూజియంలలోనే చూడాల్సి ఉంటుందేమో!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top