చనిపోయిన వ్యక్తి బతికొస్తే ఇలా ఉంటుందా

చనిపోయిన వ్యక్తి బతికొస్తే ఇలా ఉంటుందా - Sakshi


చైనా, మునాన్ రాష్ట్రంలోని జిన్‌లాంగ్ గ్రామానికి చెందిన జిజియాంగ్ అనే 51 ఏళ్ల వ్యక్తి 2009లో కనిపించకుండా పోయాడు. ఆయన కోసం ఆయన తమ్ముడు జియాంజున్, సోదరి చెన్ జియావోఫెన్ ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. పోలీసులకు ఫిర్యాదుచేసినా వారు పట్టించుకోలేదు. ఆయన గురించి కుటుంబ సభ్యులు దాదాపు మరచిపోయిన సమయంలో సమీప నగర జాతీయ రహదారిపై 2012లో జరిగిన ఓ కారు ప్రమాదంలో జిజియాంగ్ మరణించాడు. ఈ విషయమై స్థానిక పోలీసుల నుంచి తమ్ముడు జియాంజున్‌కు కబురొచ్చింది. ఇరుగు పొరుగును తీసుకొని ఆయన ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాడు. ఘోరమైన కారు ప్రమాదం కావడంతో జిజియాంగ్ మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పైగా మూడేళ్ల క్రితం ఊరి నుంచి అదృశ్యమైన జిజియాంగ్‌ను వేసుకున్న దుస్తులను బట్టి గుర్తించే అవకాశం కూడా లేకపోయింది. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా గుర్తిస్తామని చెప్పిన చైనా పోలీసులు, తమ్ముడి రక్తం నమూనాలను తీసుకున్నారు. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మరణించిందీ జిజియాంగ్ అనే తేలిపోయింది. ఉబికొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్న తమ్ముడు అన్న మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాడు. గ్రామంలోని కొండపైన ఎత్తైన సిమెంటు సమాధిని నిర్మించాడు. దానిపై బంగారం పూతతో అన్న పేరును చెక్కించాడు. కాలక్రమంలో ఆ జ్ఞాపకాలను కూడా అటు జిజియాంగ్ అక్క చెన్, ఇటు తమ్ముడు జియాంజున్ మరచిపోయారు.



2015, జూన్ నెలలో అక్క చెన్ ఇంటిముందు ఓ కారొచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఆ గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు, ఓ అధికారి కిందకు దిగారు. వెనక సీటు నుంచి ఎప్పుడో చనిపోయిన జిజియాంగ్ కూడా దిగాడు. ఆయన్ని చూసిన ఆయన అక్క చెన్ దిగ్భ్రాంతికి గురైంది. తన కళ్లను తానే నమ్మలేకపోయింది. చనిపోయిన వ్యక్తి ఎలా బతికొచ్చాడని కంగారు పడింది. అక్కా! అంటూ ఆమెను పలకరించినా అప్పుడప్పుడు మానసిక వైకల్యంతో ప్రవర్తించే జిజియాంగ్ తన గురించి తాను ఏమీ చెప్పలేక పోయాడు. ఇంతకాలం ఎక్కడున్నదీ, ఏం చేసిందో కూడా చెప్పలేక పోయాడు.



ఆయన్ని తీసుకొచ్చిన వ్యక్తి తాను ‘హ్యాంగ్‌యాంగ్ కౌంటీ రెస్క్యూ స్టేషన్’ అధికారిగా పరిచయం చేసుకున్నారు. తప్పిపోయినవారిని, గల్లంతయిన వారిని రక్షించి, తాత్కాలికంగా ఆశ్రయం కల్పించడం ఆ రెస్క్యూ స్టేషన్ డ్యూటీ. తాము రక్షించినది జిజియాంగ్‌నేననే విషయాన్ని ధ్రువీకరించుకున్నాక, ఆ అధికారి ఆయన్ని మళ్లీ ఎక్కడికో తీసుకెళ్లారు. ఇదే విషయమై జిజియాంగ్ అక్క చెన్‌ను మీడియా ప్రశ్నించగా, తనకు తెలిసినంతవరకు జరిగిన ఈ కథంతా చెప్పుకొచ్చింది.



తన తమ్ముడు జిజియాంగ్ చిన్నప్పటి నుంచి పిచ్చివాడేమీ కాదని, బక్కపలచగా, పొట్టిగా ఉండడమే కాకుండా కడు బీద కుటుంబానికి చెందిన వాడవడంతో ఊళ్లో ఎవరూ పిల్లను ఇవ్వలేదని, ఆ రంధితో అప్పుడప్పుడు పిచ్చివాడిగా ప్రవర్తించేవాడని చెన్ చెప్పుకొచ్చారు. ఎండనకా, వాననకా కాయకష్టం చేసి బతికే తన తమ్ముడు చివరిరోజుల్లో తనలో తాను మాట్లాడుకుంటూ గాలికి తిరిగేవాడని ఆమె చెప్పుకొచ్చింది. దేశంలో అక్రమంగా నడుస్తున్న ఇటుక బట్టీల్లో బానిసలా పనిచేయడానికి జిజియాంగ్‌ను మానవ అక్రమ రవాణా ముఠా కిడ్నాప్ చేసి ఉంటుందని, వయస్సు మీరాక వదిలేసి ఉంటారని చెన్ అనుమానం వ్యక్తంచేసింది. ఇరుగుపొరుగులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంమై మీడియాతో మాట్లాడేందుకు పక్క గ్రామంలో భార్యా పిల్లలతో స్థిరపడిన ఆయన తమ్ముడు నిరాకరించాడు.



మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారిని కిడ్నాప్‌ చేయడం చైనాలో ఇప్పుడు మామూలు విషయమని దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న బీజింగ్‌లోని ఓ సంస్థ డైరెక్టర్ తెలిపారు. మానసిక  వైకల్యంతో బాధ పడుతున్నవారు కూడా ఇతరులతో సమానంగా శారీరకంగా కష్టం చేస్తారని ఆయన చెప్పారు. వారు ఎప్పటికీ పారిపోరు గనుక ఇలాంటివారిని లక్ష్యంగా చేసుకొని దేశంలో మానవ అక్రమ రవాణా ముఠాలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.



ప్రస్తుతం 58 ఏళ్ల వయస్సున్న జిజియాంగ్ బైషి పట్టణంలోని ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్నాడు. తనలో తాను గొణుక్కుంటూ అక్కడక్కడే తిరుగుతుంటాడు తప్ప, ఎవరిని ఏమీ అనడు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నా చైనా ప్రభుత్వం జిజియాంగ్ లాంటి వాళ్ల పోషణ కోసం నెలకు 50 డాలర్లను ఖర్చుపెడుతోంది. కేసు కూడా ఇప్పటికీ నడుస్తోంది. ఆ కేసేమిటో పోలీసు అధికారులకే తెలియాలి.



ఇది సరే, 2012లో కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఎవరన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే! ఆయన వెనక కూడా ఎలాంటి సామాజిక కథ దాగుందో!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top