రేప్ తప్పించేందుకు ఇంతటి పైశాచికమా!

రేప్ తప్పించేందుకు ఇంతటి పైశాచికమా! - Sakshi


లండన్: రక్తంలో ప్లెజర్ కోసం, నరాల తీపి కోసం రేప్‌లు చేసే మృగాళ్ల కబంధ హస్తాల నుంచి ఆడ బిడ్డలను రక్షించుకునేందుకు ఆ తల్లులు దారుణాలకు ఒడిగడుతున్నారు. మగాళ్ల దృష్టిని ఆకర్షించకుండా ఉండేందుకు ఆడ పిల్లల బ్రెస్ట్‌లను ఐరన్ చేస్తున్నారు. అందుబాటులో ఉన్న బలమైన రాయి, సుత్తి, గరిటె లాంటి వస్తువులను ఎర్రటి నిప్పుల్లో ఎర్రగా కాల్చి బ్రెస్ట్‌లను కాల్చి వేస్తున్నారు. అవి పెరగుకుండా మూర్ఖంగా అడ్డుకుంటున్నారు. సంపన్న వర్గానికి చెందిన మహిళలు మాత్రం మరీ ఇంత ఘోరంగా కాకుండా తమ ఆడ పిల్లలకు ఎదిగే వయస్సులోనే ఛాతికి బలమైన ప్లాస్టిక్ బెల్ట్‌లను బిగిస్తున్నారు. ఏడాది వరకు అలాగే ఉంచుతున్నారు.



నైజీరియా, దక్షిణాఫ్రికా, కామెరూన్ లాంటి దేశాల్లోనే కాకుండా బ్రిటన్‌లో కూడా ఇలాంటి అనాచారం యధేశ్చగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 లక్షల మంది ఆడ పిల్లలు ఈ అకృత్యానికి బలవుతున్నారని ఐక్యరాజ్య సమితియే ఓ నివేదికలో వెల్లడించింది. ఈ దేశాల్లో ‘ఫిమేల్ జనిటల్ మ్యుటిలేషన్’ (స్త్రీ జననాంగ విరూపం లేదా సున్తీ) కూడా అమల్లో ఉందని ఆ నివేదిక పేర్కొంది. 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యనున్న ఆడపిల్లలపైనే ఈ ‘బ్రెస్ట్ ఐరనింగ్’ పాశవిక ప్రక్రియను అమలు చేస్తున్నారు. త్వరగా ఎదుగుతున్నట్టు కనిపించిన సందర్భాల్లో 9 ఏళ్ల వయస్సున్న వారిపై కూడా ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు.



ఈ ప్రక్రియ పర్యవసానాలు కూడా దారుణంగా ఉంటున్నాయి. కొందరిలో బ్రెస్ట్ ప్రాంతంలో జన్యువులు పూర్తిగా చనిపోయి మగరాయుళ్లుగా మిగిలిపోతుండగా, కొందరికి పుండ్లు అవడమే కాకుండా ఇన్‌ఫెక్షన్ కారణంగా ఏళ్లపాటు పస్ కూడా వస్తోంది. దద్దుర్లు వచ్చి దురద శాశ్వతంగా ఉండిపోతోంది. ఎక్కువ మంది బ్రెస్ట్‌లు అష్టవక్రంగా మారిపోతున్నాయి. తల్లులైన ఇలాంటి బాధితుల్లో ఎక్కువ మందికి ‘తల్లిపాలు’ రాకుండా పోతున్నాయి.



మూఢ విశ్వాసంగా కొనసాగుతున్న ఈ ‘బ్రెస్ట్ ఐరనింగ్’ వెనకనున్న ఉద్దేశం మాత్రం ప్రధానంగా రేప్‌ల నుంచి తప్పించ డం, మగాళ్ల దృష్టిని ఆకర్షించకుండా జాగ్రత్త పడడమే. పెళ్లి కాకుండా తల్లులు కాకూడదనే ఉద్దేశం కూడా ఉంది. ఆడపిల్ల వైపు నుంచి ప్రోత్సాహం ఉండకూడదనే ఉద్దేశంతో జననాంగ సున్తీకి పాల్పడుతున్నారు. అభివృద్ధి చెందినప్పటికీ నల్ల జాతీయుల్లోనే ఈ అనాచారం ఎక్కువగా కనిపిస్తోంది. 58 శాతం కేసుల్లో తండ్రికి ఏ మాత్రం తెలియకుండా తల్లులే ఈ అకృత్యాన్ని ఆచరిస్తున్నారు. తమ రక్షణ, శ్రేయస్సుకోసం తల్లి అలా చేస్తోందని  భావించడంతో బాధితులెవరూ దారుణం గురించి బయటపెట్టడం లేదు. తల్లుల గురించి ఫిర్యాదు చేయడం లేదు.



ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునేందుకు నైజీరియా, దక్షిణాఫ్రికా, కామెరూన్ లాంటి దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందిన బ్రిటన్‌లో కూడా చట్టాలు లేవు.  సంస్కృతి, సంప్రదాయం, మతం పేర్లతో ఈ అనాచారం ముడివడి ఉండడంతో ప్రభుత్వాలు కూడా ఈ దిశగా చట్టాలు తీసుకరావాలనే ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు ఈ అంశంపై ప్రజల్లో, ప్రభుత్వాల్లో చైతన్యం తీసుకరావడం కోసం లండన్‌లోని ‘చారిటీ విమెన్స్ అండ్ గర్ల్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్’ కృషి చేస్తోంది. పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, పాఠశాలల టీచర్లు, ఇతర సామాజిక కార్యకర్తలను కలుపుకొని ఈ సామాజిక అనాచారానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. అందులో భాగంగా ఈ సంఘం బాధితులను ఇంటర్వ్యూలు చేస్తోంది.




 


 


 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top