గాల్లో విమానం.. పైలెట్ చనిపోయాడు

గాల్లో విమానం.. పైలెట్ చనిపోయాడు - Sakshi


సిరాకస్(అమెరికా): కొన్ని వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతోంది. అది కూడా గమ్యస్థానానికి ఇంకా చాలా దూరంలో ఉంది. అనుకోకుండా పైలెట్కు అస్వస్థత.. కొద్ది సేపటికే మృతి. దీంతో తొలుత కంగారు పడిన కో పైలెట్ తిరిగి ధైర్యంగా వ్యవహరించి సురక్షితంగా విమానం దించేశాడు. అమెరికాకు చెందిన విమానం పైలెట్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై గాల్లోనే ప్రాణాలు విడిచాడు. దీంతో కో పైలెట్ జాగ్రత్తతో వ్యవహరించి ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా విమానాన్ని దించివేశాడు.



అయితే, ఈ విషయం ముందుగా ప్రయాణీకులకు తెలియకుండా అతడు జాగ్రత్తపడటంతో ఓ భారీ ఆందోళన, భయానికి తావివ్వకుండా చేసినట్లయింది. ఆదివారం రాత్రి 11.55 గంటలకు అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం 550 ఫోనిక్స్  నుంచి బోస్టన్కు బయలు దేరింది. అయితే ప్రయాణం మధ్యలోనే పైలెట్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యి, ఆ వెంటనే ప్రాణాలుకోల్పోవడంతో వెంటనే విమానం బాధ్యతలు పూర్తి స్థాయిలో కో పైలెట్ తీసుకున్నాడు. మధ్యలోనే సిరాకస్కు చెందిన విమానాశ్రయ అధికారులను సంప్రదించి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, వెంటనే విమానాన్ని దించివేయాలనుకుంటున్నానని, అందుకు అనుమతివ్వాలని కోరాడు.



దీంతోపాటు రన్ వే దగ్గరికి వెంటనే ఎమర్జెన్సీ అంబులెన్స్ను పంపించాలని కోరాడు. ఇందుకు సిరాకస్ అధికారులు అంగీకరించడంతో దానిని సోమవారం ఉదయం 7గంటల ప్రాంతంలో సురక్షితంగా దించివేశాడు. అలా దించిన తర్వాతనే పైలెట్ చనిపోయాడని, అందుకే విమానం అత్యవసరంగా దిగిందని, తోటి ప్రయాణీకులకు, సిరాకస్ విమానాశ్రయ అధికారులకు తెలిసింది. కో పైలెట్ నిర్వహించిన బాధ్యతలను విమానాశ్రయ అధికారులు మెచ్చుకోగా.. అందులోని ప్రయాణీకులు మాత్రం ఒక్క క్షణం గుండెలపై అమ్మో అని చేతులేసుకున్నారు.



ఎయిర్ బస్ ఏ 320 ద్వారా ప్రయాణీకులను బోస్టన్ నగరానికి తరలించారు. ఇందులో మొత్తం 147మంది ప్రయాణీకులు ఉన్నారు. కాగా, కో పైలెట్ కూడా పైలెట్కు ఉండే సామర్థ్యతను కలిగి ఉంటాడని, అతడు ప్రమాదాలను నివారించగలడని అమెరికా ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా ఎయిర్ లైన్స్లో ప్రయాణంలో ఉండగా ఏడుగురు పైలెట్లు, ఒక చార్టర్ పైలెట్ మరణించాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top