ఇండియాకు హైస్పీడ్ రైళ్లు దండగ

ఇండియాకు హైస్పీడ్ రైళ్లు దండగ


ఇంతకీ ఇండియా ఇపుడు హైస్పీడ్ రైళ్లపై అంత ఖర్చుపెట్టడం దండగని చెప్పింది వేరెవరో కాదు. హెచ్‌టీటీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి బిబోప్ గ్రేష్టా. ఇండోర్‌లోని ఐఐఎంలో ఇటీవల నిర్వహించిన ఐ5 సదస్సుకు ఆయన హాజరైన సందర్భంగా మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మలేసియాలో బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థతో మాట్లాడినపుడు కూడా ఆసియాను పెద్ద మార్కెట్‌గా అభివర్ణించారు. ఆ ఇంటర్వ్యూల వివరాలివీ...

 

* ఆ టెక్నాలజీకి కాలం చెల్లింది  

* హెచ్‌టీటీ సీఓఓ గ్రేష్టా వ్యాఖ్య




భారతదేశం హైస్పీడ్ రైళ్ల దిశగా వెళుతూ భారీగా ఖర్చుచేస్తోంది. మీరు దీన్నొక అవకాశంగా భావిస్తారా?

మేం ఇండియా నాయకులతో మాట్లాడతాం. వారు నిజంగా జనం తాలూకు రవాణా కష్టాల్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారో, లేరో తెలుసుకుంటాం. ఇండియాలో హైస్పీడ్ రైళ్ల గురించి ఏళ్ల తరబడి చెబుతూనే ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం ఇదో చెత్త. హైస్పీడ్ రైళ్ల టెక్నాలజీకి కాలం చెల్లింది. తదుపరి తరానికిది పెనుభారంగా మారుతుంది. విదేశాలు చేసిన తప్పుని ఇండియా మళ్లీ చెయ్యటమెందుకు? ఈ టెక్నాలజీకి పెట్టుబడి ఎక్కువ. అది ఏ దశలోనూ తిరిగిరాదు.

 

తప్పులు... అంటే మీ ఉద్దేశమేంటి?


నేను ఇండియాకు వచ్చేముందు చైనా రైల్వే అధికారులతో మాట్లాడా. కొన్ని రూట్లలో వ్యవస్థ గరిష్ఠ సామర్థ్యాన్ని చేరుకుందని, దాన్ని మూడు రెట్లు వేగవంతం చేయాల్సిన అవసరముందని వాళ్లు చెప్పారు. ఎందుకంటే గంటకు 600 కిలోమీటర్ల వేగం దాటితే గాలిలో నిరోధం చాలా ఎక్కువుంటుంది. అక్కడ గాలి ద్రవంగా మారుతుంది. దీంతో వేగం పెంచాలంటే విపరీతమైన ఇంధనం కావాలి. చాలా ఖర్చవుతుంది. దీర్ఘకాలంలో అసాధ్యం కూడా.

 

సరే! మరి హైపర్ లూప్‌తో దీన్నెలా మారుస్తారు?

హైపర్‌లూప్ టెక్నాలజీలో గాలి ఉండదు. నిరోధం కూడా ఉండదు. దాదాపు ధ్వని వేగంతో ప్రయాణించొచ్చు. హైస్పీడ్ రైలుకు పెడుతున్న ఖర్చులో ఆరోవంతుతో ఈ వ్యవస్థను నిర్మించొచ్చు. ఇంధ నం అతితక్కువ చాలు. సోలార్ ప్యానెళ్లు, గాలి, పునరుత్పాదక ఇంధనాల సాయంతో హెచ్‌టీ నడుస్తుంది. దీనర్థం... చ్‌టీకి వాడే ఇంధనం కన్నా 30 శాతం అధికంగా దాన్నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే... హెచ్‌టీ ఒకరకంగా ప్రజల్ని రవాణా చేసే ఓ భారీ పవర్‌స్టేషన్.

 

ఇండియాలో ఇదంతా సాధ్యమా?

నిజానికి హైపర్‌లూప్ నిర్మాణానికి భూగర్భమే కరెక్టు. ప్రస్తుతం మనకు ఆ టెక్నాలజీ లేదు కనక పైలాన్లపై నిర్మిస్తాం. అంటే ఇపుడున్న పైలాన్లనే వినియోగిస్తాం. సిటీలోకి ప్రవేశించడానికి, బయటకెళ్లటానికి ప్రస్తుత మౌలిక సదుపాయాలనే వినియోగిస్తాం. అవసరమైతే కొత్తవీ నిర్మించొచ్చు. దేశంలో విశ్లేషించి, హైపర్‌లూప్ టెక్నాలజీకి అనువైన రెండు కారిడార్లను గుర్తించాం.

 

మరి స్థానికులు నిరాశ్రయులైతే? ఎందుకంటే ఇండియాలో చాలా ప్రాజెక్టుల జాప్యానికి ప్రధాన కారణమదేగా?

పైలాన్లపై నిర్మిస్తే ఈ సమస్య ఉండదు. రోడ్డును స్తంభింపజేయకుండా ప్రతి 60 మీటర్లకూ పైలాన్‌ను నిర్మిస్తాం. ఇవి తీవ్రమైన భూకంపాలను కూడా తట్టుకునేలా ఉంటాయి. హైపర్‌లూప్ ద్వారా ఉత్పత్తయ్యే ఇంధనాన్ని బయటకు సరఫరా చేసేలా పైలాన్లుంటాయి. దీని నిర్మాణంతో భూములకు విలువ వస్తుంది. నిర్వహణకు అత్యంత భారీ వ్యయమయ్యే టెక్నాలజీకి బదులు... ఇండియాలో ఇలాంటి టెక్నాలజీ వాడితే మంచిది. పైగా ఇది  పర్యావరణానికి అనుకూలం.

 

మీ టెక్నాలజీని అత్యంత రహస్యంగా ఉంచారని, మీ పరీక్షల ఫలితాలను వెల్లడించటం లేదని ఆరోపణలొస్తున్నాయి...

మీరు ఇంటర్నెట్‌లో చూస్తున్నది మా తుది ప్రాడక్ట్ కాదు. మార్కెట్లో మాకూ ఒక  పోటీదారుంది. మా డిజైన్లను బయటపెడితే వారు కాపీ చేసే అవకాశమూ ఉంది. అందుకే... ఎవ్వరూ కాపీ చెయ్యలేని దశలో మా డిజైన్లను విడుదల చేస్తాం.

 

మరి నమూనాలు, పరీక్షల సంగతేంటి?

ప్రస్తుతం నమూనాల్ని నిర్మిస్తున్నాం. లాస్ ఏంజిలిస్‌లోని మా ప్రాజెక్టుకు వచ్చే ఏడాది ఫిబ్రరిలో కొన్ని అనుమతులొస్తాయి. 2019లో మా తొలి వాహనం పరుగుతీస్తుంది. మరో రెండు ప్రాజెక్టులపై సంతకాలు చేశాం. ఒకటి స్లొవేకియాలో వస్తుంది.



రెండోది దుబాయ్‌లో అని ఇంటర్నెట్ నిండా కనిపిస్తోంది?

నేనైతే ఇప్పుడే పేరు చెప్పలేను. అయితే ఆ దేశంలోనే తొలి హైపర్‌లూప్ టెక్నాలజీ వస్తుందని మాత్రం చెప్పగలను.

 

భారత్‌లో భాగస్వామ్యాలేమైనా ఉన్నాయా?

ఇండియాలో 14 కంపెనీలతో భాగస్వామ్యం ఉంది. వారు గోప్యంగా పని చేస్తున్నారు. వివరాలు త్వరలో ప్రకటిస్తాం. ఇంజినీరింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లకు ఇండియా కీలకమని మా నమ్మకం. మాతో చేతులు కలపాలన్న కంపెనీలన్నిటికీ పిలుపునిచ్చాం. మా ప్రాజెక్టు కోసం 52 దేశాల్లో 600 కంపెనీలు పనిచేస్తున్నాయి. అవన్నీ కన్సల్టెంట్ల కిందికే వస్తాయి. వాటిని మేం కొనుగోలు చేయం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top