మమకారానికి రోబో పిల్లలు


సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన జపాన్‌లో నానాటికీ వృద్ధతరం పెరిగిపోతూ యువతరం తరిగిపోవడంపై ఆందోళన నెలకొంది. 2050 సంవత్సరం నాటికి 30 నుంచి 35 ఏళ్ల యువతరం కన్నా 70 ఏళ్లకు పైబడిన వారు రెండింతలు అవుతారన్న అంచనా కూడా పాలకుల్లో కలవరం రేపుతోంది. అక్కడి యువతరం ముఖ్యంగా ఎక్కువ మంది యువతులు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవించాలని నిర్ణయించుకోవడం, పెళ్లి చేసుకున్న జంటలు కూడా సంతానం వద్దనుకోవడం వల్ల జపాన్‌లో వృద్ధతరం పెరుగుతోంది.



ప్రతి సమస్య పరిష్కారానికి రోబో టెక్నాలజీ వైపు చూసే జపాన్‌ ఈ సమస్య కూ రోబో సాంకేతిక పరిజ్ఞానాన్నే నమ్ముకుంది. సంతానం కోసం దంపతులను ప్రోత్సహించడానికి రోబో పిల్లలను ప్రత్యేకంగా తయారు చేసి వారికివ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొమ్మిది నెలల వయస్సు నుంచి రెండేళ్ల వయసు కలిగిన రోబో పిల్లలను జపాన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో అచ్చంగా రోబో పిల్లలు కూడా అలాగే ప్రవర్తించేలా వాటిలో సిమ్యులేటర్లు అమరుస్తున్నారు. పెద్ద పెట్టున ఏడవడం, అరిచి గీపెడుతూ అల్లరి చేయడం వంటివి ఈ రోబో పిల్లలు చేస్తాయట. అంతేకాకుండా తల్లిదండ్రుల స్పర్శను కూడా అవి అనుభూతి చెందడమే కాకుండా జలుబు చేయడం లాంటి జబ్బులు వాటికొచ్చే ఏర్పాట్లు కూడా ఈ సిమ్యులేటర్ల ద్వారా చేస్తున్నారు.



రోబో పిల్లలను పెంచుకున్న దంపతుల్లో ఆ తర్వాతైనా మమకారం పెరిగి వారిలోనూ  పిల్లలను కనాలని కోరిక పుడుతుందనే ఈ ప్రయోగమట. అయితే అది ఎంత వరకు అనేది ప్రశ్న! కానీ తప్పకుండా వారిలో పిల్లలపై ప్రేమ పెరిగి తీరుతుందని అమెరికా, ఆస్ట్రేలియా దంపతుల్లో రోబో పిల్లలతో తాము జరిపిన ప్రయోగంలో రుజువైందని కిరోబి మినీ రోబో పిల్లాడిని ఇటీవల ఆవిష్కరించిన టొయోటా కంపెనీ ఇంజనీర్లు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top