గౌరవమే ముఖ్యం... వీసా తృణప్రాయం..

గౌరవమే ముఖ్యం... వీసా తృణప్రాయం.. - Sakshi


న్యూఢిల్లీః 'పగరీ'ని తీయమన్నందుకు ప్రముఖ బీజేపీ ఎంపీ ఏకంగా యూఎస్ వీసానే తిరస్కరించారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఒకటైన పగరీని ధరించి యూఎస్ ఎంబసీకి వీసాకోసం వెళ్ళిన ఆయన్ను.. తలపై ధరించిన పగరీ తీయాలని సూచించడంతో ఆగ్రహించిన ఎంపీ.. తమ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే..  ప్రత్యేక గౌరవాన్నిచ్చే పగరీని తలపైనుంచీ తీసేది లేదంటూ.. వీసానే వద్దన్నారు. తమదేశంలో జరిగే రైతు సదస్సులో పాల్గొనేందుకు రావాలంటూ ఆహ్వానం పలికిన అమెరికా వీసాకోసం ఎంబసీకి పిలిచింది. ఈ సందర్భంలో అధికారులు పగరీని తీసేయమనడంతో అవమానంగా భావించిన సదరు ఎంపీ వీసానే తిరస్కరించారు.



బీజేపీ లోక్ సభ ఎంపీ వీరేంద్ర సింగ్.. యూఎస్ వీసాను తృణప్రాయంగా తిరస్కరించారు. తనకు వీసాకన్నా భారత సంస్కృతీ సంప్రదాయాలే ముఖ్యమని స్పష్టం చేశారు.  భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా ఎంబసీ ఇంటర్వ్యూలో  వీరేంద్ర సింగ్ ను పగరీ తీయమని అడగడంతో ఆయన ఆగ్రహించారు. వీసాను ఇవ్వకున్నా సరేగానీ తమ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమైన పగరీని తీసేది లేదని వక్కాణించారు. అయితే మొదటి ఇంటర్వ్యూలో యూఎస్ ఎంబసీ తన పగరీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. అమెరికానే స్వయంగా తనను ఆహ్వానించినట్లు గుర్తు చేశారు.  వీసాకోసం బుధవారం యూఎస్ ఎంబసీకి వెళ్ళని వీరేంద్ర సింగ్ ను 'పగరీ' (తలపాగా) తీయమని అడగడంతో అందుకు అంగీకరించిన ఆయన... ఆమెరికా ఆహ్వానాన్ని సైతం బుట్టదాఖలు చేశారు.



రైతు కుటుంబానికి చెందిన తనకు పగరీ ఓ గౌరవ చిహ్నమని, దేశ సంస్కృతీ సాంప్రదాయాలకూ గుర్తుగా ఉండే పగరీని తీసేది లేదంటూ ఎంబసీకి వివరించినట్లు వీరేంద్ర సింగ్ చెప్పారు. భద్రతకోసం తన గౌరవాన్ని ఎలా వదులుకుంటానంటూ ఆయన ప్రశ్నించారు. తమ దేశాన్ని సందర్శించమని అమెరికా స్వయంగా ఆహ్వానించిందని.. పగరీ తీయమన్నందుకు తాను వీసాను తిరస్కరించినట్లు చెప్పారు.   

భారత సంప్రదాయ సంస్కృతుల్లో భాగంగా మహాత్మా పూలే వంటి వారు కూడా పగరీ ధరించడం కనిపిస్తుంది. అటువంటి పగరీని పార్లమెంట్ లో సమస్యలపై చర్చించేప్పుడు  సైతం ధరించి కనిపించే వీరేంద్ర సింగ్.. వీసాకోసం ఎంబసీముందు తీయడం అగౌరవంగా భావించి.. ఏకంగా యూఎస్ వీసానే తిరస్కరించారు. ఆత్మ గౌరవంకోసం అమెరికాకే షాకిచ్చిన ఎంపీ... జరిగిన ఘటనపై పార్లమెంట్ లో లేవనెత్తుతానని హెచ్చరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top