2040 నాటికి ఉత్తర ధ్రువ జలమార్గం






ఏటేటా పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా భూమి ఉత్తరధ్రువంలోని ఆర్కిటిక్‌ మంచుకొండలు మరో 23 ఏళ్లలో, అంటే 2040 సంవత్సరం వచ్చే ఎండాకాలంలో పూర్తిగా కరిగిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గతంలో అంచనావేసిన దానికన్నా 30 ఏళ్ల ముందే ఆర్కిటిక్‌ మంచుకొండలు కరిగిపోతాయన్నది వారి తాజా అంచనా. గత 30 ఏళ్లలో సగానికి సగం మంచుకొండలు కరగిపోయాయి. ఇప్పటికే మొత్తంగా మూడొంతుల మంచుకొండలు కరిగిపోగా, మిగిలిన నాలుగో వంతు భాగం రానున్న 23 ఏళ్లలో కరిగిపోతుంది.



మంచుకొండలు కరిగిపోవడం వల్ల నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తర యూరప్‌ నుంచి ఈశాన్య ఆసియాకు వెళ్లాలంటే సూయెజ్‌ కెనాల్‌ మీది నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఆర్కిటిక్‌ మంచు కొండలు కరిగిపోతే ఉత్తర జలమార్గంలో దూరం ఐదింట రెండు వంతులు తగ్గుతుంది. దక్షిణ హాలండ్‌లోని ప్రధాన ఓడరేవు అయిన రోటర్‌డామ్‌ నుంచి జపాన్‌లోని యొకోహమా, షాంఘై నగరాలకు ఉత్తర జలమార్గం ద్వారా త్వరగా చేరుకోవచ్చు. రోటర్‌డామ్‌ నుంచి యొకోహమాకు మధ్య 3,840 నాటికల్‌ మైళ్ల దూరం ఉంది. ఈ దూరం ప్రయాణించడానికి 9 రోజులు పడుతుంది. 2,361 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న షాంఘై నగరానికి చేరుకోవాలంటే ఐదున్నర రోజులు పడుతుంది. ప్రస్తుతం సూయజ్‌ కాలువ మీదుగా దక్షిణ ధ్రువాన్ని చుట్టి పోవాల్సి వస్తోంది.



2040 నాటికి ఆర్కిటిక్‌ సముద్రంలోని మంచు కొండలు కరిగిపోయినా ఆ మార్గం గుండా నౌకాయానం చేసే అవకాశం ఉంటుందో, లేదో చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దాని కారణంగా దక్షిణ ధ్రువ ప్రాంతాలకన్నా సముద్ర జలాలు వేగంగా వేడెక్కడం, తుఫానులు సంభవించడం, సముద్రం అల్లకల్లోలంగా తయారవడమే అందుకు కారణమని వారంటున్నారు. ఉత్తర జలమార్గం కోసం ఉత్తరధ్రువ ప్రాంతాల్లోని దేశాలన్నీ పరస్పర రవాణా ఒప్పందాలు చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆశిస్తున్నాయి.



Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top