మరోసారి భూప్రళయం ముంచుకొస్తోంది

మరోసారి భూప్రళయం ముంచుకొస్తోంది - Sakshi


దాదాపు 2.5 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిన భూప్రళయంలో సముద్రంలో జీవజాలం 96 శాతం నశించిపోగా భూమ్మీద దాదాపు 70 శాతం వృక్ష, జంతుజాలం నాశనమైపోయింది. మరోసారి అలాంటి భూ ప్రళయం వచ్చే ప్రమాదం పొంచి ఉందని, అలాంటి ప్రళయం వస్తే ఈసారి అప్పటికన్నా ఎక్కువ నష్టం, అంటే సమస్త జీవరాశి నాశనమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



రెండున్నర వేల ఏళ్ల క్రితం భారీ విస్ఫోటనంతో భూ ప్రళయం సంభవించినప్పుడు భూమి ద్రవ్యరాశి ఒక్కసారిగా ముక్కలు, ముక్కలుగా విడిపోయి అనంత విశ్వంలో కలసిపోయిందని, పర్యవసానంగా భూమి మీద, నీటిలోని జీవరాశి నాశనమైందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. నాడు భూ ప్రళయం సంభవించడానికి కారణం అగ్ని పర్వతాలు బద్దలై, వాటి నుంచి వెలువడిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాతావరణంలో కలవడం, దానికి హైడ్రేట్స్‌ నుంచి వెలువడిన మిథేన్‌ వాయువు తోడవడం వల్ల ఎక్కడికక్కడ పేలుడు సంభవించిందని ఇంతకాలం వారు భావిస్తూ వచ్చారు. నాటి ప్రాచీన శిలల్లో నిక్షిప్తమైన వాయువులపై అంటారియాలోని బ్రూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన అంశం వెలుగులోకి వచ్చింది.



భూమిపైన అగ్ని పర్వతాలు బద్దలవడానికి అసలు కారణం భూతాపోన్నతి పెరగడమేనని, కర్బన ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరిగిన పర్యవసానంగానే అగ్ని పర్వతాలు బద్దలయ్యాయని, అప్పటికే భూగాళాన్ని ఆవరించి ఉన్న కార్బన్‌ డై ఆక్సైడ్‌కు అగ్ని పర్వతాల నుంచి వెలువడిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ తోడవడం, దానికి మిథేన్‌ గ్యాస్‌ జత కావడం వల్ల భూ ప్రళయం సంభవించిందని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. మానవుడికి తెలిసి ఇలాంటి భూ ప్రళయాలు ఇప్పటికి ఐదుసార్లు సంభవించాయని, 2.5 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిన ప్రళయమే అన్నింటికన్నా భయానకమైనదని పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ ఉవే బ్రాండ్‌ తెలిపారు.



నాడు అగ్నిపర్వతాలు పేలిపోవడం వల్ల హఠాత్తుగా వాతావరణంలో ఉష్ణోగ్రత 11 డిగ్రీలు పెరిగిందని, సరాసరి ప్రపంచ ఉష్ణోగ్రత ఇప్పుడు కూడా 29 సెంటీగ్రేడ్లకు పెరిగే అవకాశం ఉందని, దానివల్ల అనూహ్యంగా అగ్ని పర్వతాలు బద్దలై భూతాపోన్నతి మరింత తీవ్రమై మరోసారి భూ ప్రళయం సంభవించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే ఇది ఎప్పుడు సంభవిస్తుందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేకపోయారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top