భారత జవాన్లను అరెస్ట్ చేసిన నేపాల్ పోలీసులు

భారత వార్తా ఛానెళ్లకు వ్యతిరేకంగా నేపాల్ విధ్యార్థుల నిరసన


- భారత్- నేపాల్ సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితి

- భాతర వార్తా ఛానెళ్ల ప్రసారాలు నిలిపేసిన హిమాలయ దేశం


కఠ్మాండు: ఆసియా పెద్దన్నపై నేపాల్ ఆగ్రహం వెళ్లగక్కింది. గడిచిన కొద్దిరోజులుగా ఇరుదేశాల మధ్య బలహీనపడుతూ వస్తున్న సంబంధాల 'తీగ'ను నేపాల్ మరింత లాగింది. దీంతో ఆ దేశంలో భారత్ కు చెందిన 42 న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. మరోవైపు సశస్త్ర సీమా బల్ కు చెందిన 13 మంది జవాన్లను నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


 


భారత్ నుంచి నేపాల్ కు అక్రమ రవాణా అవుతున్న ఆయిల్ ట్యాంకర్ ను పట్టుకునేందుకు భారత జవాన్లు నేపాల్ భూభాగంలోకి కిషన్ గంజ్ లోకి ప్రవేశించారు. అయితే అనూహ్యంగా అక్కడి ప్రజలు.. భారత జవాన్లపై తిరగబడి, బంధించి, నేపాల్ పోలీసులకు అప్పగించారు. 'ఎస్ఎస్ బీకి చెందిన ఎనిమిది మంది సిబ్బందిని నేపాల్ పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిపించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాం' అని ఎస్ఎస్ బీ ఐజీ దీపక్ కుమార్ మీడియాకు తెలిపారు. నిత్యావసర సరుకుల రవాణాను నిలిపివేసిన భారత చర్యకు ప్రతిచర్యగా హిమాలయ దేశం ఈ తరహా నిరసనాత్మక చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది.


 


కాగా, సరుకుల రవాణా నిలిపివేతపై భారత్ వాదన మరోలా ఉంది. కేవలం భద్రతా కారణాల వల్లే రవాణాను నిలిపివేశామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ నేపాల్ వాటిని తిరస్కరించింది. నూతన రాజ్యాంగం అమలు నేపధ్యంలో దక్షిణ నేపాల్లోని భారత సరిహద్దు వద్ద మాదేసీలు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారటం, భారత జవాన్ల కాల్పుల్లో ఒక నేపాలీ చనిపోవటం, అటుపై భారత్ నేపాల్ కు సరుకుల రవాణా నిలిపివేయడం తద్వారా ఇరుదేశాల సంబంధాలు మరింత దెబ్బతిన్న సంగతి తెలిసిందే.



ఈ క్రమంలో ముందుగా నేపాల్ కు చెందిన మాజీ మావోయిస్ట్ స్ప్లింటర్ పార్టీ భారతీయ చానెళ్ల ప్రసారాలకు వ్యతిరేకిస్తూ ప్రచారాన్ని లేవనెత్తింది.  నేపాల్ కేబుల్ టీవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ప్రసారాల నిలిపివేత నిరవధికంగా కొనసాగుతుందన్నారు. నేపాల్ జాతీయ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయంలో భారత్ కలుగజేసుకున్నట్లయితే శాశ్వతంగా భారత్ చానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.



అలాగే ఖాట్మండులోని ఓ థియేటర్ కూడా భారతీయ సినిమాల ప్రదర్శనను రెండు రోజుల నుంచి నిలిపివేసినట్లు సమాచారం. ఖాట్మండుతోపాటు నేపాల్ లోని కొన్ని ప్రాంతాల్లో భారతీయ చానెళ్లకు చెప్పుకోదగ్గ ఆదరణ ఉంది. ఏదేమైనా భారత్ ఉద్దేశపూర్వకంగా రవాణాకు అవరోధం కల్పించినా,  నేపాల్ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకున్నా నేపాలీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది.



ఉప్పు, చక్కెర, వంట గ్యాస్ సిలిండర్ల వంటి నిత్యావసరాలు కొన్ని వందల ట్రక్కుల్లో సరిహద్దులో నిలిచిపోయాయి. నేపాల్ ఈ విషయంలో భారత్ మీద చాలా వరకు ఆధారపడి ఉంది. నేపాల్ ప్రస్తుత విదేశాంగ మంత్రి ఖాగా రాజ్ భారత్ విదేశాంగ రాయబారి రంజిత్ రేతో ఈ విషయమై చర్చించినట్లు సమాచారం.  దీనిపై రంజిత్ వివరణ ఇస్తూ.. భారత్ నుంచి సరుకుల రవాణాకు ఎటువంటి అవరోధం లేదని.. సమస్య అంతా నేపాలీల అసత్య ప్రచారాలు, నిరసనల నుంచే వచ్చిందని చెప్పుకొచ్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top